Gold Purchase: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథకంలో దూసుకుపోతున్నప్పటికీ అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక- రాజకీయ ఆందోళనలు, ముడి చమురు ధరల ఒత్తిడి కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, అనవసరమైన బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తూ దేశీయ ఆర్థిక వ్యవస్థకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని స్వదేశీ నినాదాన్ని పునరుద్ఘాటించారు. ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్ పర్యటన సందర్భంగా తొలిసారి బంగారం కొనుగోళ్లను ఒక ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడంపై పీఎం మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. అలాగే గతంలో చేసిన విజ్ఞప్తిని గుర్తు చేశఆరు. స్వదేశీ వస్తువులనే కొనాలని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, అవసరం లేకుండా బంగారం కొనుగోలు చేయవద్దని మరోసారి కోరారు. ప్రస్తుతం కిరిగిస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.
'దేశ ప్రజలకు అభినందనలు. ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతం నమోదు కావడం గొప్ప విషయం. ప్రజల సంకల్ప బలం, కృషికి నిదర్శనం. ప్రపంచ దేశాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో భారత్ అసాధారణ ఘనతను దక్కించుకుంది. ప్రపంచంలో ఎక్కడ చూసిన యుద్ధాలే, సంక్షోభాలే. సప్లై చైన్ పూర్తిగా దెబ్బతిన్నది. 2020 కోవిడ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదు. అయినా భారత్ పురోగమిస్తోంది' అని ఇన్‌స్టా వీడియోలో మోదీ పేర్కొన్నారు.
విదేశీ మారక నిల్వల పరిరక్షణే ప్రధాన లక్ష్యం
ప్రపంచ ఇంధన మార్కెట్లో అస్థిరత, పశ్చిమాసియా సంక్షోభంతో దిగుమతి వ్యయం భారీగా పెరుగుతోంది. దీంతో విదేశీ మారక నిల్వలను పరిరక్షించడం, కరెంట్ అకౌంట్ లోటను అదుపులో ఉంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలుస్తోంది. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద బంగారం దిగుమతిదారు. వార్షికంగా భారత్ బిలియన్ల కొద్దీ డాలర్లు బంగారం కోసం ఖర్చు చేస్తోంది. దీంతో భారీగా యూఎస్ డాలర్లు విదేశాలకు తరలిపోతున్నాయి. అందుకో బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని సూచిస్తున్నారు. అలాగే వినోదం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లడం తగ్గించాలని, భారతీయులు దేశంలోని పర్యటక ప్రాంతాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. టూరిజం రూపంలో కోట్లాది డాలర్లు విదేశాలకు వెళ్లిపోకుండా చూడాలని కోరారు.
