అమెరికాలో వలసదారులకు శాశ్వత నివాసం హోదా కల్పించే గ్రీన్ కార్డు నిబంధనల విషయంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం వెనక్కి తగ్గింది. గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను వలసదారులు తమ స్వదేశంలో చేసుకోవాల్సి ఉంటుందని ఇటీవల అమెరికా చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసిన విషయం తెలిసిందే.
అయితే, పాత విధానం ప్రకారం అమెరికాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS) ప్రకటించినట్టు ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలను వెలువరించింది.
ఇదేమీ విస్తృతస్థాయి విధాన మార్పులు కాదని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వివరణ ఇచ్చింది. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుడు అమెరికాలో ఉండి పూర్తిచేయాలా? స్వదేశానికి వెళ్లాలా? అనేది ఇమిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని పేర్కొంది. ఈ నిబంధన చాలాకాలం నుంచి అమల్లో ఉందని తెలిపింది. మే 21న ఇచ్చిన మార్గదర్శకాల ఉద్దేశం ఇమిగ్రేషన్ అధికారులకు ఆ విచక్షణాధికారాన్ని గుర్తుచేయడం తప్పా కొత్తదేమీ కాదని డీహెచ్ఎస్ ప్రతినిధి పేర్కొన్నారు. గ్రీన్ కార్డు కోసం వలసదారుల దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నప్పుడు కూడా వారు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. తాజా ప్రకటనతో అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులకు భారీ ఊరట లభించినట్టయ్యింది. అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల్లో చైనా (52 లక్షలు) తర్వాతి స్థానం భారతీయులదే.
అయితే, వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం లేదా ఇమిగ్రేషన్‌కు సంబంధించిన ఇతర అంశాలను మాత్రం తాము పరిగణనలోకి తీసుకుంటామని సూచనప్రాయంగా తెలిపింది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వివరణ ఇచ్చినప్పటికీ.. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తుచేసిన వలసదారులు ఎటువంటి పరిస్థితుల్లో అమెరికాను విడిచి వెళ్లాల్సిన అవసరం ఉంటుందనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వలసదారుల్లో పలు ప్రశ్నలు మిగిలేఉన్నాయి.
గతవారం వెలువరించిన మార్గదర్శకాలపై ఆ శాఖలోని కొంతమంది అధికారులు కూడా వాటి పరిధిపై అనిశ్చితితో ఉన్నారని సమాచారం. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. వైట్ హౌస్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి ఈ చర్యను వలసల వ్యూహంలో ఒక ముఖ్యమైన మార్పుగా కాకుండా, ఒక సాధారణ పరిపాలనాపరమైన విషయంగా అభివర్ణించారు.

