ఆకస్మిక వరదల్లో చనిపోయిన గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు నేపాల్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. వ్యాధుల ముప్పు, ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
మెరుపు వరదల్లో ఇప్పటి వరకు 682 మంది మృతిచెందగా.. 2,400 మందికిపైగా గల్లంతయ్యారు. అత్యధికంగా భారత దక్షిణ సరిహద్దులో ఉన్న చింత్వాన్ జిల్లాలోనే 233 మృతదేహాలను ఇప్పటి వరకు వెలికితీసినట్టు వివరించింది. ఆసుపత్రులలో తగినంత స్థలం, సౌకర్యాలు లేకపోవడంతో మృతదేహాలు భద్రపరచడం చిత్వాన్ జిల్లా అధికార యంత్రాగానికి సవాల్‌గా మారింది. తాత్కాలిక ఏర్పాట్ల కింద ఉంచిన మృతదేహాలు ఎక్కువగా కుళ్లిపోవడం, వాటి నుంచి వస్తున్న దుర్వాసన వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరగొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరించడంతో జిల్లా అధికారులు శనివారం మృతదేహాలను ఖననం చేయాలని నిర్ణయించారు.
''మృతదేహాల సంఖ్య పెరిగిపోవడంతో వాటిని ఉంచడానికి మేము ఒక ఇంటిని ఫ్రీజర్‌గా ఉపయోగించాం'' అని ఒక అధికారి తెలిపారు. 'ఆ ఇంట్లో కూడా స్థలం సరిపోకపోవడంతో, వాటిని ఖననం చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు'' అని ఆ అధికారి పేర్కొన్నారు.
మృతదేహాల డీఎన్ఏ సేకరణ
మృతదేహాలను ఖననం చేయడానికి ముందు వాటి నుంచి DNA నమూనాలను అధికారులు సేకరిస్తున్నారు. భవిష్యత్తులో గుర్తింపును సులభతరం చేయడానికి వారు గుర్తింపు లేదా రిఫరెన్స్ నంబర్లను ఉపయోగించి రికార్డులను కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి మృతదేహానికి దాని లొకేషన్ ట్యాగ్‌తో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది తద్వారా DNA సరిపోలిన తర్వాత బంధువులు వాటిని వెలికితీయడానికి అవకాశం ఉంటుంది. శనివారం మధ్యాహ్నానికి 100కు పైగా మృతదేహాలకు DNA ప్రొఫైలింగ్ పూర్తయింది. ఇవి ఖననానికి సిద్ధంగా ఉన్నాయి.1.5 మీటర్ల లోతు సమాధులు
మృతదేహాలను తర్వాత సులభంగా వెలికితీయడానికి వీలుగా ఈ సమాధులను 1.5 మీటర్ల లోతుకు తవ్వుతున్నారు. DNA ద్వారా గుర్తించిన నిర్దిష్ట మృతదేహాన్ని మాత్రమే వెలికితీయడానికి వీలుగా వాటి మధ్య 40 సెంటీమీటర్ల ఖాళీని ఉంచారు. మృతదేహాలను ఒక గుర్తింపు సంఖ్య ఉన్న సంచులలో ప్యాక్ చేస్తున్నారు. ప్రతి సమాధి వద్ద మృతదేహం గుర్తింపు సంఖ్యను వేయడానికి సైన్‌బోర్డుతో కూడిన కాంక్రీట్ వేదికను నిర్మిస్తున్నారు.సమాధి ప్రక్రియను వీడియో, ఫోటోగ్రఫీ ద్వారా నమోదు చేయడానికి, అలాగే సమాధి స్థలాన్ని జియో-ట్యాగ్ చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. తప్పిపోయిన తమ బంధువుల కోసం వెతుకుతున్న వారికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రులలో DNA నమూనాలను అందించాల్సి ఉంటుంది. DNA పరీక్ష ఫలితాలు అందిన తర్వాత నేపాల్ ఆరోగ్య శాఖ వాటిని మృతదేహాల నుంచి సేకరించిన DNAతో సరిపోల్చి నిర్దిష్ట మృతదేహం నంబర్‌ను గుర్తిస్తుంది. ఆ నంబర్ ఆధారంగా, పోలీసులు రికార్డులను పరిశీలించి మృతదేహాన్ని ఖచ్చితంగా ఎక్కడ పూడ్చిపెట్టారో నిర్ధారిస్తారు.
ఆ తర్వాత మృతదేహాలను వెలికితీసి వారికి అప్పగిస్తారు. గుర్తించని, వారసుల్లేని మృతదేహాల వివరాలను పోలీసులు ఒక వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. అధికారుల ప్రకారం... నేపాల్‌లో వందలాది మంది విదేశీయులు సహా 2,426 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు.

