Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హాకీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి, ఇంటికి పంపించిన భారత్..!

హాకీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి, ఇంటికి పంపించిన భారత్..!

హాకీ ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌లోని అమస్టెల్‌వీన్‌లో జరిగిన పూల్-డి గ్రూప్ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అలరించింది.

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైవోల్టేజ్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 5-3 తేడాతో భారత్ ఓడించింది. మ్యాచ్ తొలి నిమిషం నుంచే దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ఈ గెలుపుతో భారత్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. పాకిస్థాన్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది.

మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ అటాకింగ్ గేమ్‌తో పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి పెంచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో మళ్లీ తన మార్క్ చూపించాడు. 5వ నిమిషంలోనే అతడు తొలి గోల్ సాధించాడు. 11వ నిమిషంలో అభిషేక్ భారత్‌కు రెండో గోల్ అందించాడు. దీంతో భారత్.. 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో తొలి క్వార్టర్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

మరోవైపు రెండో క్వార్టర్‌లోనూ భారత్ ఆధిపత్యం చలాయించింది. హర్మన్ ప్రీత్ (21వ నిమిషం), అభిషేక్ (24వ నిమిషం) మళ్లీ చెరో గోల్ చొప్పున సాధించారు. మూడో క్వార్టర్‌లో హార్దిక్ సింగ్ (35వ నిమిషం) చేసి.. భారత ఆధిక్యాన్ని భారీగా పెంచేశాడు. ఇక పాకిస్థాన్ తరఫున షాహిద్ రెండు గోల్స్, సుఫ్యాన్ ఖాన్ ఒక గోల్ సాధించాడు. చివరి క్వార్టర్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు.. ఒత్తిడి పెంచడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.


పాకిస్థాన్ మ్యాచ్‌లోకి తిరిగి రావడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ, ఒత్తిడిని జయించిన టీమిండియా డిఫెన్స్ ఏమాత్రం తడబడలేదు. పాక్ ఆటగాళ్లకు మరే అవకాశం ఇవ్వకుండా సమర్థవంతంగా బంతిని నియంత్రిస్తూ మ్యాచ్‌ను 5-3తో ముగించింది. దాయాది పాకిస్థాన్‌పై ఇటీవల కాలంలో సాధిస్తున్న ఆధిపత్యాన్ని భారత్ ఈ ప్రపంచకప్‌లోనూ కొనసాగించి నాకౌట్ రేసులో ముందంజ వేసింది. ఈ పరాజయంతో పాకిస్థాన్ హాకీ ప్రపంచకప్ 2026 నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో గ్రూప్-డిలో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఆరు పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam