హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అంజయ్య నగర్‌లో నిర్మాణ దశలో ఉన్న ఏడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
నాలా పక్కనే ఉన్న 50 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాలు పక్కనే ఉన్న అపార్టుమెంట్ మీద కూడా పడ్డాయి. ప్రమాదం కారణంగా భారీ శబ్దం రావటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీప హాస్టల్ విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు భవనం శిథిలాల కింద నుంచి రెండు మృతదేహాలను బయటకు తీశారు. ముగ్గురు కార్మికులు చిక్కుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం కాగా.. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న రెండు మృతదేహాలను వెలికి తీశారు.. మరోవైపు భవనం శిథిలాలు పడటంతో పక్కనున్న అపార్టుమెంట్ గోడలు కూడా దెబ్బతిన్నాయి. చనిపోయిన వారిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టైల్స్ కార్మికులుగా గుర్తించారు.
రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాజాగూడలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ సమీపంలో జరిగిన ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు బైక్‌పై ఖాజాగూడ నుంచి గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ వైపు వెళ్తున్నారు. ఈ సమయంలోనే ఇంజినీరింగ్ కాలేజ్ రెండో గేటు సమీపంలో.. కేర్ హాస్పిటల్ మెయిన్ రోడ్డు వైపు టర్న్ తీసుకుంటుండగా బైక్ అదుపుతప్పింది. దీంతో ముగ్గురూ కిందపడిపోయారు.ఈ ప్రమాదంలో బెంగాల్‌కు చెందిన ఐటీ ఉద్యోగి అబ్బాస్ సిద్ధిక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సహస్ర ఛటోపాధ్యాయ, అభిజిత్ సింగ్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. సిద్ధిక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

