Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం హైవే విస్తరణకు లైన్ క్లియర్.. PPPAC ఆమోదం, రూ.12 వేల కోట్లతో 6 లైన్లు

హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం హైవే విస్తరణకు లైన్ క్లియర్.. PPPAC ఆమోదం, రూ.12 వేల కోట్లతో 6 లైన్లు

Telugu Samayam 1 week ago

నేషనల్ హైవే 65 హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం ఆరు లైన్లుగా విస్తరించే ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయ్యింది. కేంద్రానికి చెందిన పీపీపీఏసీ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య అప్రైజల్‌ కమిటీ) ఈ నేషనల్ హైవే విస్తరణ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది.

ఎన్‌హెచ్‌ఏఐ ( నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రతిపాదనకు ఓకే చెప్పారు. కేంద్ర సీసీఈఏ (ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ) ఆమోదం తెలియజేయగానే ఈ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అవుతుంది.. ఈ నెలలోనే ఆ అనుమతి కూడా వస్తుందని భావిస్తున్నారు.

జాతీయ రహదారి 65 ప్రస్తుతం నాలుగు లైన్లుగా ఉంది.. ఇప్పుడు దానిని ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. హైదరాబాద్‌ శివారు మల్కాపూర్‌ నుంచి విజయవాడలోని గొల్లపూడి బైపాస్‌ వరకు 226 కి.మీ.ల ఆరు లైన్లుగా మూడు ప్యాకేజీలుగా విస్తరిస్తారు. హైదరాబాద్‌ నుంచి నందిగామ వరకు.. నందిగామ నుంచి గొల్లపూడి దగ్గర విజయవాడ బైపాస్‌ వరకు బీవోటి విధానంలో రెండు ప్యాకేజీల కింద పనులు చేస్తారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హైవేను మూడో ప్యాకేజీ కింద విస్తరించనున్నారు. ఈ హైవేలో నాలుగు వరుసలుగా ఇరువైపులా 14 కి.మీ.లలో సర్వీస్‌ రోడ్లు నిర్మిస్తారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మచిలీపట్నం వరకు 44 కిలోమీటర్లు హ్యామ్ విధానంలో ఆరు వరుసలుగా విస్తరించనున్నారు.

ఈ హైవేను భవానీపురం దగ్గర కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు 5 కిలోమీటర్లు మేర విస్తరించాలని ప్రతిపాదించినా పీపీపీఏసీలో అనుమతివ్వలేదు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ బైపాస్‌ గొల్లపూడి వరకే విస్తరణను పరిమితం చేశారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హైవేను విస్తరిస్తుండగా.. బెంజ్ సర్కిల్ నుంచి ఈడుపుగల్లు కూడలి వరకు ప్రతిపాదించిన ఆరువరుసల ఫ్లై ఓవర్‌కు ఆమోదం తెలియజేయలేదు. ఈ విస్తరణ ప్రాజెక్టులో హైదరాబాద్‌ టు విజయవాడ మధ్య 226 కి.మీ.. విజయవాడ టు మచిలీపట్నం మధ్య 58 కి.మీ. కలిపి మొత్తం 284 కి.మీ. విస్తరణ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు. భూసేకరణ, నిర్మాణ వ్యయానికి కలిపి రూ.12వేల కోట్ల మేర అంచనాలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. సీసీఈఏ ఆమోదం రాగానే భూసేకరణ, ప్యాకేజీల వారీగా టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam