గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ, కుంటలు, నాలాల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా హైడ్రా తీసుకుంటున్న చర్యలు భేష్ అని చెన్నై మెట్రోపొలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CBDA ) పేర్కొంది.
ఒక వైపు సముద్రం, మరోవైపు కిక్కిరిసిన నివాసాలు, వర్షకాలం వరదలు చెన్నైకి సర్వసాధారణంగా మారాయని.. హైడ్రా లాంటి వ్యవస్థ చెన్నై సిటీకి కూడా అవసరమని అన్నారు. వివిధ శాఖలకు చెందిన విభాగాలను ఒకే గొడుగుకిందకు తీసుకువచ్చి ఆయా శాఖలతో సమన్వయంతో హైడ్రా పనిచేసి అనతి కాలంలోనే మంచి ఫలితాలను సాధించిందని కొనియాడింది. -హైడ్రా కార్యకలాపాలపై అధ్యయనం చేసిన చెన్నై బృందం.. సీఎండీఏ దేశంలోనే అతి పురాతనమైన ఏజెన్సీ అని పేర్కొంది. హైడ్రా లాంటి వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుందో పరిశీలించడానికి హైదరాబాద్ వచ్చినట్టు సీఎండీఏ ప్రతినిధి బృంధానికి నేతృత్వం వహించిన సీఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ సాఖమూరి తెలిపారు.
చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలు తొలగించడంతో పాటు ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణ సాధారణ విషయం కాదని అన్నారు. ఏడాదిన్నర కాలంలోనే 1166 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడం సామాన్యమైన విషయం కాదన్నారు. వరదల కట్టడితో పాటు.. భూగర్భ జలాలను పెంచి వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణలో చెరువుల పునరుద్ధరణ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆ దిశగా హైడ్రా చర్యలు అనుసరణీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులతో పాటు ఆయా శాఖల సమన్వయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైడ్రా పునరుద్ధరించిన చెరువులతో పాటు.. వర్షాకాలంలో నాలాల పూడిక తీత కార్యక్రమం, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నిత్యం నిఘా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌ల పనితీరుకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
అమీర్‌పేటలో పూడుకుపోయిన నాలాలను పునరుద్ధరించటం, సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ నాలా విస్తరణతో వరదలను ఆయా ప్రాంతాల్లో ఎలా నివారించామో వీడియోలతో చూపించారు. గతంలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులను చూపించి అక్కడివారు ఈ ఏడాది ఎంత భద్రంగా ఉన్నారో వారి వాయిస్‌లను వినిపించారు. చెన్నైలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారో కూడా హైడ్రా అధికారులు ఆరాతీశారు. హైడ్రా, హెచ్‌ఎండీఏ, జలమండలి, జీహెచ్‌ఎంసీ పనితీరును అధ్యయనం చేయడానికి వచ్చిన సీఎండీఏ ప్రతినిధి బృందంలో సీడీఎంఏ చీఫ్ ప్లానర్ ఎన్‌ఫోర్సుమెంట్ డి. సభాపతి, సీనియర్ ప్లానర్ ఆర్ కే వేదవతి, పలువురు సూరింటెండెంట్ ఇజినీర్లు ఉన్నారు.

