హథీరాంజీ పీఠాధిపతి పదవి నుంచి సంత్ అర్జున్‌దాస్‌ను తొలగిస్తూ 2023 నవంబరు 24న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు రద్దుచేసింది.
ఏపీ ధార్మిక పరిషత్, దేవాదాయశాఖలు జారీచేసిన ఉత్తర్వులను సంత్ అర్జున్‌దాస్ హైకోర్టును ఆశ్రయించగా.. వాటిని సమర్థిస్తూ 2025 మే 9న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో ఆయనకు ఊరట దక్కింది. ఆయన స్థానంలో మఠాధిపతిగా తగిన వ్యక్తిని నియమించాలన్న నిర్ణయాన్ని తిరస్కరిస్తూ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది.
అర్జున్‌దాస్ తొలగింపును సమర్థిస్తూ ఏపీ దేవాదాయ శాఖ 2023 డిసెంబరు 8న వెలువరించిన ఉత్తర్వులను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దీంతో పాటు 2024 జనవరి 19న ఏపీ ధార్మిక పరిషత్, 2023 ఆగస్టు 1న త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలను రద్దుచేస్తున్నట్టు వెల్లడించింది. మఠాధిపతిగా సంత్ అర్జున్‌దాస్ కొనసాగుతారని, మఠానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో ఆయన పాల్గొనవచ్చని తెలిపింది.
హథీరాంజీ మఠాధిపతిపై ఆరోపణలపై విచారణకు రిటైర్డ్ జిల్లా జడ్జి బొడ్డేపల్లి రామారావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. సహజ న్యాయసూత్రాలను అనుసరించి ఈ కమిటీ విచారణ జరపాలని స్పష్టం చేసింది. తిరుపతి కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో విచారణ నిర్వహించాలని, ఇందుకు తగిన స్థలాన్ని చిత్తూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కేటాయించాలని స్పష్టంచేసింది. అలాగే, అర్జున్ దాస్‌కు వ్యతిరేకంగా జూన్ 8, 2023లో తయారుచేసిన ఛార్జి మెమోని రెండువారాల్లోపు ఈ కమిటీకి అందజేయాలని ఏపీ దేవాదాయశాఖ, ధార్మిక పరిషత్‌లను ఆదేశించింది.
ఏడాదిలోపు విచారణను పూర్తిచేసి, నివేదిక అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది. నివేదిక ఆధారంగా దేవాదాయ శాఖ చట్టప్రకారం తుది నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఈ నివేదికపై తుది నిర్ణయం తీసుకునే వరకు మఠం ఆస్తుల నిర్వహణలో మఠాధిపతికి సాయంగా మధ్యప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కమిటీలో ఉజ్జయినికి చెందిన స్వామిమాధవ్, మధ్యప్రదేశ్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ మనీష్ కపూరియా, ఏపీకి చెందిన సీనియర్ లాయర్ వైవీ రవిప్రసాద్, హైదరాబాద్‌కు చెందిన సీఏ మనీష్ టస్కర్‌లను సభ్యులుగా నియమించింది.
అంతేకాదు, వారంలోగా ఈ కమిటీకి ఒక సభ్యుడిని ఏపీ దేవదాయ, ధర్మాదాయశాఖ నామినేట్ చేయాలని పేర్కొంది. మూడు నెలల్లోపు హథీరాంజీ మఠానికి సంబంధించిన అన్ని స్థిర, చరాస్తుల వివరాల జాబితాను కమిటీ తయారుచేయాలని ఆదేశించింది. పెండింగ్‌లోని వివాదాల పర్యవేక్షణ, ఆక్రమణల నుంచి మఠం ఆస్తులను కాపాడటానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ వివాదం న్యాయబద్ధంగా, పక్షపాతరహితంగా పరిష్కారం కావాలని కోరుకొనే హక్కు భక్తులకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అందుకే తాము ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్టు వెల్లడించింది.

