Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హీరోలకో రూల్.. మాకో రూల్.. హీరోయిన్లని కనీసం మనిషిగా కూడా చూడరు - బాలీవుడ్ గుట్టు విప్పిన కృతి సనన్

హీరోలకో రూల్.. మాకో రూల్.. హీరోయిన్లని కనీసం మనిషిగా కూడా చూడరు - బాలీవుడ్ గుట్టు విప్పిన కృతి సనన్

Telugu Samayam 2 weeks ago

వెండితెరపై కనిపించే రంగుల ప్రపంచానికి, తెర వెనుక ఉండే వాస్తవాలకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పురుషాధిక్యత, లింగ వివక్షపై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సినిమా సెట్స్‌పై మహిళా నటీనటులను ఎంత తేలికగా తీసుకుంటారో, వారి పట్ల ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తారో ఆమె ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. కెరీర్ ప్రారంభం నుండి తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటూ, ఇండస్ట్రీలో ఇంకా మారాల్సిన వాతావరణంపై ధైర్యంగా గళమెత్తారు.

హీరోలకో న్యాయం.. హీరోయిన్లకో రూలా?
షూటింగ్ లొకేషన్లలో అసిస్టెంట్ డైరెక్టర్ల ప్రవర్తన ఎలా ఉంటుందో కృతి సనన్ ఈ సందర్భంగా ఉదాహరణలతో వివరించారు. సెట్స్‌పై ఉండే మేనేజ్‌మెంట్‌కు హీరోల టైమింగ్స్ అంటే ఒక రకమైన భయం, గౌరవం ఉంటాయని ఆమె పేర్కొన్నారు. హీరోలు ఇంకా కారవాన్‌లలో సిద్ధం కాకపోయినప్పటికీ, అసిస్టెంట్ డైరెక్టర్లు ముందు జాగ్రత్తగా హీరోయిన్లను మాత్రం ముందే పిలిచి సెట్స్‌పై కూర్చోబెడతారని విమర్శించారు. మహిళా నటీనటుల సమయాన్ని చాలా సాధారణ విషయంగా భావించే ధోరణి పరిశ్రమలో బలంగా నాటుకుపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ లగ్జరీ వసతుల కంటే కూడా, తోటి నటీనటులుగా దక్కాల్సిన ఆత్మగౌరవం, సమానత్వం ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు.

మేం చెప్తే ఇరిటేషన్.. అదే హీరోలైతే ప్రశంసలు!
సినిమా కథాంశంపై లేదా ఒక సన్నివేశంపై హీరోయిన్లు తమ అభిప్రాయాలు చెప్తే ఇండస్ట్రీ చూసే కోణమే వేరుగా ఉంటుందని కృతి సనన్ మండిపడ్డారు. "నాకు మొదటి నుంచి సినిమాల మేకింగ్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. ఒక సీన్‌ను ఇలా చేస్తే బాగుంటుందని గతంలో ఒక దర్శకుడికి సలహా ఇవ్వబోయాను. కానీ ఆయన తీవ్ర అసహనానికి గురవుతూ.. 'మరీ అంతగా లోతుగా ఆలోచించకు, చెప్పింది చెయ్' అంటూ నా అభిప్రాయాన్ని కొట్టిపారేశారు. ఆ సమయంలో నా మనసు ఎంతో గాయపడింది. ఒక నటి ప్రశ్నలు అడిగితే 'ఈమె మళ్లీ మొదలుపెట్టింది, ఎన్ని ప్రశ్నలు అడుగుతుంది' అని గుసగుసలాడుకుంటారు" అని కృతి చెప్పారు.

అయితే అదే సన్నివేశం గురించి పక్కనే ఉన్న ఒక మేల్ స్టార్ (హీరో) ప్రశ్నలు అడిగినా లేదా సలహాలు ఇచ్చినా లొకేషన్‌లో ప్రశంసల వర్షం కురుస్తుందని కృతి సనన్ ఎండగట్టారు. "హీరో గనక అదే పాయింట్ చెప్తే.. 'వావ్.. ఆయన సినిమాపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు, కథలో ఎంతగా లీనమయ్యారు' అంటూ మెచ్చుకుంటారు. నేను చెప్పిన విషయాన్నే హీరో నోటి నుంచి వస్తే వెంటనే అంగీకరిస్తారు" అంటూ పరిశ్రమలోని డబుల్ స్టాండర్డ్స్‌ను ఆమె బయటపెట్టారు.

ప్రమోషన్లలోనూ హీరోలదే హవా
సినిమా ప్రచార కార్యక్రమాలలో సైతం హీరోయిన్లకు కనీస నిర్ణయాధికారం ఉండదని కృతి సనన్ వెల్లడించారు. హీరోయిన్లు ఏ ఏ ప్రమోషన్లలో పాల్గొనాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ఒక సందర్భంలో ఈ ప్రవర్తన నచ్చక, తనకు నిర్ణయాధికారం లేనప్పుడు ప్రమోషన్లకు రానని తాను గట్టిగా నిరాకరించినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత దర్శక నిర్మాతలు వచ్చి బతిమాలడంతోనే తాను వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు ప్రాధాన్యత లేని పాత్రలు చేయడానికి ఇష్టపడట్లేదని, నచ్చిన పాత్రలనే ఎంచుకుంటున్నారని.. అయినప్పటికీ చిత్ర పరిశ్రమలో ఇంకా పురుషాధిక్యత రాజ్యమేలుతోందని కృతి సనన్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam