హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. ఓ వ్యాపార సంస్థకు చెందిన జీఎస్టీ ఖాతాను హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. లాగిన్ వివరాలను మార్చేసి ఏకంగా రూ.183.61 కోట్ల విలువైన 730 నకిలీ ఇన్వాయిస్‌లు, అనధికార ఈ-వే బిల్లులు సృష్టించారు.
అక్రమంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు ప్రయత్నించినట్టు ఫిర్యాదు అందింది. దీంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 'యుక్తా ఫ్లైవుడ్ అండ్ హార్ట్‌వేర్'పేరుతో నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన నిఖిల్ రెడ్డి, అనంతరెడ్డిలు హయత్‌నగర్‌లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే, ఆగస్టు 3న ఆ కంపెనీ అకౌంటెంట్ జీఎస్టీ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా ఓపెన్ కాలేదు. క్రెడిన్షియల్స్ సరికావని మెసేజ్ వచ్చింది.
ఏం జరిగిందోనని పరిశీలించగా.. జులై 23నే గుర్తుతెలియని వ్యక్తులు కంపెనీ జీఎస్టీ ఖాతాతో లింక్ చేసిన మొబైల్ నంబర్, మెయిల్ ఐడీని మార్చినట్లు ఆయన గుర్తించారు. ఈ విషయం గురించి యజమానికి సమాచారం ఇవ్వడంతో చార్టెడ్ అకౌంటెంట్ సలహా మేరకు జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. లాగిన్ వివరాలను మార్చి ఖాతాలో జరిగిన లావాదేవీలను పరిశీలించడంతో భారీ సైబర్ మోసం బయటపడింది. అక్రమంగా జీఎస్టీ ఖాతాలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు మొత్తం రూ.183.61 కోట్ల విలువైన 730 నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లులు సృష్టించారు. పలు కంపెనీలు, సంస్థల పేరుతో వీటిని సృష్టించినట్లు ప్రాథమికంగా నిర్దారించారు.
ధన్‌శ్రీ ఎంటర్‌ప్రైజెస్, ట్రస్ట్ ట్రేడర్స్, హిందుస్థాన్ ట్రేడర్స్, అమర్, ఇష్రా ఎంటర్‌ప్రైజెస్ తదితర సంస్థల పేర్లను ఫిర్యాదులో ప్రస్తావించారు.ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు? ఫేక్ బిల్లుల ద్వారా ఎంత క్లెయిమ్ చేశారు? వాస్తవంగా ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నేరుగా నకిలీ జీఎస్టీ నంబర్‌ను క్రియేట్ చేయలేదు. వ్యాపార సంస్థ అసలు ఖాతానే హ్యాక్ చేసి, దానికి లింక్ అయిన మొబైల్ నంబర్, మెయిల్ మార్చి భారీగా నకిలీ బిల్లులు సృష్టించారనేది ఆరోపణ. దీంతో ఈ మోసం వెనుక వ్యవస్థీకృత సైబర్ ముఠా ఉందా? అనేది విచారణలో వెల్లడి కానుంది.

