Auto Fare In Bengaluru: బెంగళూరు సిటీ అంటే ముందుగా గుర్తొచ్చేవి చల్లని వాతావరణం, చుక్కలు చూపించే ట్రాఫిక్. సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన ఈ నగరంలో ఐటీ ఉద్యోగాలు చేసే వారు ఎక్కువగా ఉంటారు.
ఈ నగరంలో ఇప్పుడు మరో సమస్య తెరపైకి రావడం ఉద్యోగులతో పాటు సగటు మధ్యతరగతి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అదే ఆటో ఛార్జీలు. తాజాగా ఓ యువతి సోషల్ మీడియాలో షేర్ చేసిన తన అనుభవాన్ని విన్నవారు ఎంత దారణమని ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. కేవలం 15 కిలోమీటర్ల దూరానికి ఏకంగా రూ.1200 ఆటో ఛార్జీ వసూలు చేశారని, ఇది తాను బెంగళూరు నగరం నుంచి ఊహించని సంఘటన అని ఆ యువతి చెప్పుకొచ్చారు. ఆ యువతి ఆవేదన చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఒక నరకం అని ఆ యువతి పేర్కొంది.
తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న సన్యా అనే యువతి ఆవేదనలో అసలు వాస్తవం ఉంది. 'ఈ డబ్బుతో ఇంట్లోకి రెండు సార్లు సరుకులు వస్తాయి.' అని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరులో ఆఫీసుకు వెళ్లడం ఎంత నరకమో యువతి వివరించింది. ఆటో పట్టుకుని వెళ్లడం అనేది వేంకటేశ్వర స్వామికి నిలువ దోపిడి ఇచ్చుకోవడం వంటిదేనని నెటిజన్లు అంటున్నారు. ఆటో వాళ్లు అడిగే రేటు వింటే గుండె ఆగినంత పనవుతుంది. ఈ ఆటో ఛార్జీల సమస్యపై రవాణా రంగ విశ్లేషకలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'డిమాండ్‌ను బట్టి ధరలు పెంచే డైనమిక్ ప్రైసింగ్ పద్ధతిని ఆటో డ్రైవర్లు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వానికి సైతం ఆన్లైన్ అగ్రిగేటర్ల మీద నియంత్రణ లేకపోవడం శాపంగా మారింది' అని స్థానిక ట్రాఫిక్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
బెంగళూరులో ఆఫీసుకి చేరుకోవడమే ఒక పెద్ద టాస్క్ గా మారిపోయింది. వర్షం పడితే రోడ్లపై ఆటోల హారన్ల గోల తప్ప ఇంకో సౌండ్ వినిపించదు. ఒక రైడ్ బుక్ చేయడానికి పడే కష్టం, బహుశా ఐఐటీ సీటు సాధించడం కంటే కష్టంగా మారిందని సదరు యువతి చమత్కరించారు. నెటిజన్లు కూడా ఈ పోస్ట్‌పై స్పందిస్తున్నారు. 'అంత ఛార్జీ కట్టే బదులు ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లో హాయిగా పడుకోవడం మేలు' అని ఒకరు కామెంట్ చేశారు. 'క్యాబ్ బుక్ చేసుకోవడం దీని కంటే చౌక' అని మరొకరు చెప్పారు. వర్షం పడినా లేదా పీక్ అవర్స్ లో ఉన్నా క్యాబ్ ఛార్జీలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి.

