ఇన్నాళ్లకి శ్రీవల్లి పాపం పండింది. ఆమె చేసిన ఘోరాలను బయటపెడితే ఎక్కడ ఆమె కాపురం కూలిపోతుందోనని ఇన్నాళ్లూ క్షమిస్తూ వస్తారు నర్మద, ప్రేమలు. కానీ వాళ్ల కాపురంలోనే శ్రీవల్లి నిప్పులు పోస్తుండటంతో తట్టుకోలేకపోయారు..
తోడికోడలు కాపురాన్ని కూల్చేశారు నేటి (ఏప్రిల్ 02) ఎపిసోడ్‌లో.
ప్రేమ ఫోన్‌లో ఉన్న ఆడియో రికార్డింగ్‌ని డిలీట్ చేసి నర్మద, ప్రేమలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది శ్రీవల్లి. దీనవ్వా తగ్గేదేల్యా.. ఏం హీక్కుంటారో హీక్కోండి అని ఇచ్చిపడేసింది శ్రీవల్లి. ఇక ఈరోజు (ఏప్రిల్ 02) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. భాగ్యంకి ఫోన్ చేసిన శ్రీవల్లి.. 'అమ్మోయ్.. మన ప్లాన్ సక్సెస్.. ప్రేమ ఫోన్‌లో ఉన్న ఆడియో రికార్డింగ్‌ని డిలీటింగ్ చేసేశానే' అని అంటుంది. ఆ మాటతో భాగ్యం.. 'శెభాష్.. ఇప్పుడూ.. ఇప్పుడూ నా కూతురివి అనిపించావే.. ఆ ఆడియోను అడ్డుపట్టుకుని ఆ నర్మద, ప్రేమలు నీతో ఆటలాడతారా? ఇకనుంచి వాళ్లకి ఈఎంఐ పద్దతిలో రక్తకన్నీరు చూపిస్తా' అని అంటుంది. అవునే అమ్మా.. వాళ్లు ఈ శ్రీరామ నవమికి నా బండారం బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు.. కానీ నేను అదే పండుగ రోజు వాళ్లకి సినిమా చూపిద్దాం.. మీరే బేగా వచ్చేయండి' అని సంబరపడిపోతుంది శ్రీవల్లి. ఇక ఫోన్ మాట్లాడేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా పెద్దోడు పొగలు కక్కుతూ కనిపిస్తాడు. చూపులతో మింగేసేట్టు చూసేసరికి.. బిత్తరపోతుంది శ్రీవల్లి. మొత్తం వినేశాడా? అని కంగారు పడుతుంది ఎప్పటిలాగే. 'నీతో మాట్లాడాలి అని చందు అనేసరికి.. 'అద్దీ.. అద్దీ' అని నీళ్లు నములుతుంటుంది శ్రీవల్లి. చెప్పవే.. విశ్వక్ గాడ్ని ప్రేమించమని అమూల్యకి చెప్పిందెవరూ??

'ఏం ఆలోచిస్తున్నావ్ పదా.. నీతో మాట్లాడాలి' అంటూ చేయి పట్టుకుని లాక్కుని వెళ్తాడు చందు. ఇంతలో ప్రేమ.. అమూల్య దగ్గరకు వెళ్లి.. మీ అన్నయ్య చందు పిలుస్తున్నాడు వాళ్లు పెరట్లో ఉన్నారు వెళ్లు' అని కావాలనే చెప్తుంది. ఇక చందు శ్రీవల్లిని లాక్కుని వచ్చి.. 'చెప్పూ.. ఏం జరిగిందో చెప్పూ.. నువ్వు నా దగ్గర దాచిన విషయాలు ఏంటి? చెప్పూ.. అమూల్య విషయంలో ఏం జరిగిందీ?? ఆ విశ్వక్ గాడ్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరూ.. మా నాన్న హాస్పిటల్ పాలవ్వడానికి కారణం ఎవరు? అమూల్య జీవితం నాశనం కావడానికి కారణం ఎవరు?
కొన్ని నిజాలు తెలిసినా చెప్పడానికి సంస్కారం అడ్డొస్తుంది బావా.. ఒడియమ్మా

వీటన్నింటికీ కారణం ఎవరో నీకు తెలుసని నాకు తెలుసూ.. మర్యాదగా చెప్పు? ఎవరా వ్యక్తి? అని నిప్పులు చెరుగుతాడు చందు. దాంతో శ్రీవల్లి.. 'నిజంగా నాకు తెలియదు బావా' అని బుకాయిస్తుంది. 'నీకు తెలియదంటే నేను నమ్మను.. మర్యాదగా చెప్తావా లేదా?? అంటూ చేయిలేపుతాడు చందు. ఇంతలో మన బడా బిల్డప్ నర్మద, చోటా బిల్డప్ ప్రేమలు చేతులు ఊపించుకుంటూ అక్కడికి వస్తారు. శ్రీవల్లి ఏం చెప్తుందాఅని కళ్లెప్పగించి చూస్తుంటారు. అయితే శ్రీవల్లి వాళ్ల కళ్లు బైర్లు కమ్మే జలక్ ఇస్తుంది. 'చెప్తాను బావా.. చెప్తాను.. కొన్ని నిజాలు తెలిసినా కూడా చెప్పడం పద్దతి కాదు.. సంస్కారం అంతకంటే కాదు.. నువ్వు ఇంతిలా అడుగుతున్నావ్ కాబట్టి చెప్పకతప్పడం లేదు.
అదెవరో కాదు బావా.. ప్రేమా!! ఐపాయ్

విశ్వక్‌ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరో కాదు.. ఆ ప్రేమే అని అంటుంది శ్రీవల్లి. దెబ్బకి ప్రేమ తెల్లమొహం వేయగా.. బడా బిల్డప్ నర్మద బిత్తర మొహం వేస్తుంది. సరిగ్గా అప్పుడు అమూల్య వచ్చి శ్రీవల్లి చెప్పిన మాట విని షేక్ అయిపోతుంది. 'ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్.. ప్రేమ చెప్పడం ఏంటి? అని అంటాడు చందు. 'అవును బావా.. వాళ్ల పుట్టింటి గురించి వాళ్ల అన్నయ్య గురించీ ఆలోచించి.. ప్రేమే అమూల్యకి చెప్పింది. ప్రేమే ..విశ్వక్ అమూల్యల మధ్య ప్రేమ రాయభారం నడిపించింది' అని అంటుంది శ్రీవల్లి. 'నువ్వు చెప్పేది నిజమా? అని చందు అడగడుతాడు.
ఒసేయ్ నీచ్ కమీన్.. దేవుడిపై ఒట్టేసి పచ్చి అబద్దాలు

'ఒట్టు బావా.. దేవుని తోడు' అంటూ ఒట్టు పెట్టేస్తుంది. ఏయ్ అని పొట్టి పటాకా ప్రేమ వెళ్తుంటే.. మన బడా బిల్డప్ నర్మద.. ఎప్పటిలాగే ఆపేస్తుంది. 'అమూల్యని విశ్వక్ ప్రేమ పేరుతో ట్రాప్ చేయడానికి.. మామయ్య గారికి గుండె పోటు రావడానికి అమూల్య జీవితం నాశనం కావడానికీ అన్నింటికీ ప్రేమే కారణం అని అంటుంది శ్రీవల్లి. ఇంతలో అమూల్య.. 'వదినా' అంటూ ఎంట్రీ ఇస్తుంది. ఆవేశంగా శ్రీవల్లి దగ్గరకు వస్తుంది. అది చూసి.. ఆ ప్రేమని ఇరికిద్దాం అని చూస్తే.. నేను అడ్డంగా దొరికిపోయాను కదరా దేవుడా అని తల పట్టుకుంటుంది శ్రీవల్లి.
నువ్వు అసలు మనిషివేనా? చేసిందంతా చేసి ప్రేమ వదినపైకి నెట్టేస్తావా??

ఇక అమూల్య ఆవేశంగా వచ్చి.. 'ఛీ ఛీ నువ్వు అసలు మనిషివేనా? నీకు బుద్ధి ఉందా? నీ కాపురం సమస్యల్లో పడకూడదని నేను ఆలోచించి.. నువ్వు చేసిన వెధవ పనిని ఎవరితో చెప్పొద్దని నేను ప్రేమ వదిన, నర్మద వదిన దగ్గర మాట తీసుకుంటే.. నువ్వు చేసిన తప్పుని ప్రేమ వదినపైకి తోసేస్తావా? ఇన్ని జీవితాలను, కాపురాలను నాశనం చేయాలని చూస్తావా? అని కడిగిపారేస్తుంది. దాంతో శ్రీవల్లి.. 'అమూల్య.. నాకేం పాపం తెలియదు కదా' అని అంటుంది. ఏయ్ నువ్వు నోరు మూయవే అని.. నువ్వు చెప్పు అమూల్యా అని అంటాడు చందు. ఇంతలో నర్మద, ప్రేమలు కూడా సీన్‌లోకి వస్తారు.
విశ్వక్‌ని ప్రేమించమని చెప్పింది వల్లీ వదినే అన్నయ్యా..

చెప్పు అమూల్యా.. ఇది తప్పు చేసి ప్రేమ మీదికి తోయడం ఏంటి? అసలేం జరిగింది? వాళ్ల దగ్గర మాట తీసుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు చెప్పు అమూల్యా అని అంటాడు చందు. దాంతో అమూల్య నిజం మొత్తం కక్కేస్తుంది. 'విశ్వక్‌ని ప్రేమించమని చెప్పింది ఎవరో కాదు అన్నయ్యా.. నీ భార్య వల్లీనే' అని బాంబ్ పేల్చుతుంది అమూల్య. 'విశ్వక్‌ని పెళ్లి చేసుకుంటే.. మన రెండు కుటుంబాలు కలుస్తాయని.. అందుకోసం విశ్వక్‌ని ప్రేమించమని నన్ను చాలా ఫోర్స్ చేసింది 'అంటూ తనని ఎలా ట్రాప్ చేసిందో పూసగుచ్చినట్టు చెప్తుంది అమూల్య.
ఆ విశ్వక్ గాడితో చేతులు కలిపి.. కిడ్నాప్ కావడానికి కారణం వల్లీ వదినే..

నేను మొదట ఒప్పుకోకపోతే.. ఆ విశ్వక్ గాడితో చేతులు కలిపి మా మాధ్య ప్రేమ రాయబారం నడిపింది. అంతే కాదు అన్నయ్యా.. నా పెళ్లికి ముందు రోజు.. నన్ను విశ్వక్‌కి అప్పగించి కిడ్పాప్ కావడానికి కూడా కారణం వల్లీ వదినే. ఇదంతా చేసింది వల్లీ వదినే అని ఇంట్లో వాళ్లకి తెలిస్తే.. మీ కాపురం కూలిపోతుందని.. తనని పుట్టింటికి పంపేస్తారని ప్రేమ, నర్మద వదినల దగ్గర మాట తీసుకున్నాను' అని అంటుంది అమూల్య. 'అవును బావా.. అమూల్యకి ఇచ్చిన మాట కోసం మేం ఇంత వరకూ నోరు విప్పలేదు. కానీ తను మాత్రం నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూసింది' అని అంటుంది ప్రేమ.
నర్మద, ప్రేమలు కుట్రతో మన పచ్చటి కాపురాన్ని కూల్చేశారు బావా..

'మీ భార్యలు ఎలాంటి వాళ్లో తెలుసుకోకుండా వాళ్లతో ఎలా సంసారం చేస్తార్రా అని మీరు ధీరజ్, సాగర్‌లను అడిగారు కదా బావా.. మీ భార్య గురించి మీకు తెలియాలనే ఇలా చేశాం.. ఇక నిర్ణయం మీదే బావగారూ ' అని అంటుంది ప్రేమ. కట్ చేస్తే చందు శ్రీవల్లిని గదిలోకి లాక్కుని వెళ్లి ఆమె బట్టల్ని సర్దేస్తుంటాడు. బావా.. ఆ నర్మదా, ప్రేమలు నాపై కుట్ర చేశారు. నేను నీతో కలిసి సంతోషంగా ఉండటం వాళ్లకి ఇష్టం లేదు బావా.. అందుకే వాళ్లు అమూల్యకి మాయ మాటలు చెప్పి.. నాపై కుట్ర చేశారు. పచ్చటి మన కాపురాన్ని కూల్చేశారు.. అమాయకురాలైన నన్ను బలి చేశారు' అని కన్నీటిపర్యంతం అవుతుంది శ్రీవల్లి.
నాకేం పాపం తెలియదు బావా.. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా బావా..

ఆ మాటతో చందు.. వాళ్లు కుట్ర చేశారని అనడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? చెప్పూ అని అంటాడు చందు. 'లేవు బావా' అని శ్రీవల్లి అంటే.. 'కానీ నువ్వు కుట్రలు చేశావనడానికి ఆధారాలు ఉన్నాయి. నీ చదువు అబద్దం.. నీ సర్టిఫికేట్స్ మోసం.. నువ్వు అబద్దం.. నీ మాటలు అబద్దం.. అని అంటాడు చందు. బావా నేను ఏం చేసినా నీపై ప్రేమతోనే చేశారు.. నాకే పాపం తెలియదు.. వాళ్ల మాటలు విని నన్ను నీ జీవితంలో నుంచి.. ఈ ఇంట్లో నుంచి పంపించేయకు బావా.. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను.. దయచేసి నన్ను క్షమించు బావా' అని భోరున ఏడుస్తూ చందుని గట్టిగా పట్టేసుకుంటుంది శ్రీవల్లి.
నువ్వు గొప్ప కోడలివి అని మా నాన్న పొంగిపోయాడు కదే.. పో బయటకీ

ఏయ్ ఆపవే నీ దొంగ నాటకాలు.. నోరు మూసుకుని సైలెంట్‌గా మీ ఇంటికి వెళ్లు.. లేదంటే నీ బండారాన్ని అందరి ముందు బయటపెడతాను. మర్యాదగా పోతావా? లేదంటే అందరికీ చెప్పనా? నువ్వు గొప్ప కోడలివి అని మా నాన్న మురిసిపోతున్నాడు.. ఆనందంతో పొంగిపోతున్నాడు.. అందుకే నీ గురించి తెలిస్తే మా నాన్న తట్టుకోలేడనే ఇలా చేయాల్సి వస్తుంది.. ఈ బ్యాగ్ తీసుకుని బయటకు పో' అని అంటాడు చందు. 'లేదు నేను వెళ్లలేను' అని శ్రీవల్లి అనేసరికి.. పోవే అంటూ అంటూ చేయి పట్టుకుని ఇంటి వెనుక నుంచి శ్రీవల్లిని బయటకు లాక్కొస్తాడు చందు.

