ఇండోనేషియా పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌పై ప్రశంసలు కురిపించారు. ఇండోనేషియా స్వాతంత్య్రంలో బిజు పట్నాయక్ పోషించిన పాత్రను మోదీ కొనియాడారు.
జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ''మన రెండు దేశాలూ దాదాపు ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందాయి.. ఇండోనేషియాకు 1945లో.. భారత్ 1947లో పరాయి పాలన నుంచి విముక్తి లభించింది'' అని అన్నారు.
స్వతంత్ర దేశాలుగా సార్వభౌమాధికారం విషయంలో ఐక్యరాజ్యసమితిలో ఇండోనేషియా స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుగా భార్ ఒక 'బలమైన గొంతుకగా' నిలిచిందని ఆయన తెలిపారు. ''ఆ కాలంలో గౌరవనీయ బిజు పట్నాయక్ పోషించిన పాత్ర, ఇండోనేషియా ప్రధానమంత్రి సుతాన్ షహ్రిర్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ హట్టాలను సురక్షితంగా భారతదేశానికి తీసుకువచ్చిన తీరు.. మన రెండు దేశాలను మరింత దగ్గర చేసింది'' అని పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్.. భారత వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. 1947కు రెండేళ్ల ముందు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నప్పటికీ డచ్ వారితో ఇండోనేషియా సాయుధ పోరాటం కొనసాగింది. ఈ సమయంలో డచ్ సైన్యం విధించిన దిగ్బంధనం నుంచి అప్పటి ఇండోనేషియా ప్రధాని సుతాన్ షహ్రిర్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ హట్టాలను రక్షించాలని భారత సైన్యాన్ని నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆదేశించారు.
ఇండోనేషియా మళ్లీ తమ వలస రాజ్యంగా మార్చుకోవాలనే దురుద్దేశంతో డచ్ భారీ ఎత్తున సైనిక దాడికి దిగి, కీలక నేతలను గృహనిర్బంధంలో ఉంచింది. ప్రధాని నెహ్రూ ఆదేశాలతో భారత వాయుసేన ఆపరేషన్ ప్రారంభించింది. ఆ ఇద్దరు నాయకులను తీసుకొచ్చేందుకు బిజూ పట్నాయక్, కో-పైలట్ అయిన ఆ భార్య జ్ఞానవతి పట్నాయక్.. డకోటా పిలిచే డగ్లస్ సి-47 సైనిక రవాణా విమానంలో బయలుదేశారు. వారిని డచ్ సైన్యం కళ్లుగప్పి సింగపూర్ మీదుగా ఇండోనేషియా నుంచి బయటకు తీసుకువచ్చారు.
మార్గమధ్యంలో విమానాన్ని కూల్చివేస్తామని డచ్ బెదిరింపులకు కూడా దిగినా వెనక్కి తగ్గలేదు. ఎలాంటి చర్యలకు దిగినా భారత్ నుంచి ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని పట్నాయక్ హెచ్చరిక జారీ చేశారని నివేదికలు తెలిపాయి. తమ నేతలను కాపాడేందుకు బిజు పట్నాయక్ చూపిన తెగువ, సాహసానికి గుర్తుగా ఇండోనేషియా ఆయనకు గౌరవ పౌరసత్వాన్ని ప్రదానం చేసింది.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, ఇండోనేషియా భాగస్వామ్యంలో ఇప్పుడు 'సువర్ణ అధ్యాయం' ప్రారంభం అవుతోందని, ఇది 21వ శతాబ్దంపై, యావత్ మానవాళిపై ప్రగాఢమైన సానుకూల ప్రభావాన్ని' చూపుతుందని అన్నారు. విస్తృత ద్వైపాక్షిక చర్చల అనంతరం, రక్షణ, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, సముద్ర భద్రత, విద్య, అరుదైన ఖనిజాలు, డిజిటల్ కనెక్టివిటీ వంటి కొత్త రంగాలకు భారత్, ఇండోనేషియా తమ సహకారాన్ని విస్తరిస్తాయని ప్రధాని మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ప్రకటించారు.

