Retirement Plan: రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే చాలా మంది ఏదో ఒక రూ.1 కోటి లేదా రూ.2 కోట్లు ఉంటే సరిపోతుందని భ్రమపడుతుంటారు. కానీ, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ డిజర్వ్ కో ఫౌండర్ సందీప్ జెత్వానీ ఇటీవలే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన గణాంకాలు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలను ఉలిక్కి పడేలా చేసింది.
ప్రస్తుతం నెలకు రూ.2 లక్షల ఖర్చు చేసే జీవన శైలిని అనుభవిస్తున్న వ్యక్తి 20 ఏళ్ల తర్వాత పదవీ విరమణ పొందాలనుకుంటే అతని వద్ద కనీసం రూ.40 కోట్లు ఉండాలని ఆయన పేర్కొనడం గమనార్హం. మరి అది సాధ్యమేనా? తెలుసుకుందాం.
రూ.40 కోట్ల సంఖ్య కేవలం ఒక ఊహ కాదు, ఇది నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆధారంగా చెబుతున్న అంకె. సాధారణంగా మనం 5-6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. కానీ, ఒక విలాసవంతమైన లేదా సౌకర్యవంతమైన జీవన శైలిని గడిపే వ్యక్తికి లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ సుమారు 9 శాతంగా ఉంటుందట. అలాగే ప్రైవేట్ హెల్త్ కేర్ ఖర్చులు ప్రతి సంవత్సరం 12-14 శాతం వరకు పెరుగుతున్నాయి. అలాగే పని వారి జీతాలు, మెట్రో నగరాల్లో ఇంటి అద్దెలు, అంతర్జాతీయ ప్రయాణాలు, క్లబ్ మెంబర్ షిప్‌ల వంటి ఖర్చులు 8-10 శాతం పెరుగుతున్నాయి. నేటి రూ.2 లక్షల ఖర్చు 9 శాతం ఇన్‌ఫ్లేషన్ ప్రకారం 20 ఏళ్ల తర్వాత నెలకు రూ.11.20 లక్షలకు చేరుతుంది. అంటే ఏడాదికి సుమారు రూ.1.34 కోట్ల వరకు అవసరమవుతుంది.
నేటి కాలంలో వైద్య సదుపాయాలు మెరుగుపడటంతో మనిషి సగటు ఆయుర్దాయం పెరుగుతోంది. చాలా మంది 80-90 ఏళ్ల వరకు జీవిస్తున్నారు. అంటే 60 ఏళ్లకు రిటైర్ అయితే మరో 30 ఏళ్ల పాటు ఎలాంటి సంపాదన లేకుండా జీవించాల్సి వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత మన డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా డెట్ ఫండ్స్‌లో పెడుతుంటారు. అక్కడ వచ్చే రిటర్న్స్ 8-9 శాతం లోపే ఉంటాయి. ఇన్‌ఫ్లేషన్ 9 శాతానికి సమానంగా ఉన్నప్పుడు మన అసలు ధనం పెరగదు. కాబట్టి ఏడాదికి రూ.1.34 కోట్లు చొప్పున 30 ఏళ్ల పాటు బతకాలంటే దాదాపు రూ.40 కోట్లు మీ చేతిలో ఉండాల్సి వస్తుంది.
ముందే పెట్టుబడి పెట్టాలి
40 ఏళ్ల వయసులో ఉన్నవారు తమ పోర్ట్ ఫోలియోను ఈక్విటీల వైపు మళ్లించడం మంచిదని సూచిస్తున్నారు. నెలకు ఒక నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.40 కోట్లను సాధించడం అసాధ్యమేమీ కాదు. పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి రక్షణ కోసం బలమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కలిగి ఉండడం తప్పనిసరి. రిటైర్మెంట్ అంటే కేవలం పని ఆపేయడం కాదు, మనం అలవాటు పడిన జీవన ప్రమాణాలను కొనసాగించడం. రూ.40 కోట్లు అనేది ఒక బెంచ్ మార్క్ మాత్రమే. మీ ఖర్చులు అవసరాలను బట్టి ఈ సంఖ్య మారతుంది. కానీ, రేపటి ఆనందం కోసం నేటి నుంచే ప్రణాళికాబద్ధంగా పొదుపు చేయడం అత్యవసరమని ఈ లెక్కలు హెచ్చరిస్తున్నాయి.
