Dailyhunt
Iran War ఉద్ధృతం: రెడ్ లైన్స్ దాటొద్దు.. అమెరికాకు తలుపులు మూసేసిన ఇరాన్

Iran War ఉద్ధృతం: రెడ్ లైన్స్ దాటొద్దు.. అమెరికాకు తలుపులు మూసేసిన ఇరాన్

Telugu Samayam 1 week ago

శ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటు ఇరాన్ మధ్య జరుగుతోన్న సవాళ్లు, ప్రతి సవాళ్లతో యుద్ధభూమి మరింత వేడెక్కింది.

హర్మూజ్‌ జలసంధిని తెరవడానికి ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యంతో జరుగుతున్న సంప్రదింపులు, శాంతి చర్చలకు తలుపులు మూసేసింది. ఈ మేరకు ఇరాన్‌ ప్రభుత్వ పత్రిక టెహ్రాన్‌ టైమ్స్‌ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. ''అమెరికాతో ఉన్న అన్ని దౌత్య, పరోక్ష సంప్రదింపులు, చర్చల మార్గాల నుంచి ఇరాన్‌ వైదొలగింది. ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడిని కూడా ముగించింది'' ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.

ఇరాన్‌ నాగరికత మొత్తం నేటి రాత్రితో అంతమైపోతుందన్న ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ దీటుగానే కౌంటర్ ఇచ్చింది. అమెరికా, దాని మిత్రులు కూడా తమ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్, టర్కీ, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో అమెరికాతో జరుగుతున్న చర్చలకు ఇరాన్ ముగింపు పలికింది. తమ 'రెడ్ లైన్స్' (హద్దులు) దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తమ స్పందన పశ్చిమాసియా దాటి విస్తరిస్తుందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వార్నింగ్ ఇచ్చింది.

ఇప్పటికే గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. సౌదీ అరేబియాలో అమెరికాకు చెందిన రెండు పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, ఇజ్రాయెల్ సైనిక సామాగ్రి తరలించే నౌకపై కూడా కచ్చితమైన దాడులు చేశామని పేర్కొంది. పౌర లక్ష్యాలను తాము టార్గెట్ చేసుకోమని, కానీ తమ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తేలేదని, ప్రతీకారం తీర్చుకుంటామని పునరుద్ఘాటించింది.

పశ్చిమాసియాలో చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఏళ్ల తరబడి పనిచేయకుండా ధ్వంసం చేయగలమని కూడా ఇరాన్ హెచ్చరికలు చేసింది. అమెరికా మిత్రదేశాల విషయంలో తాము ఇప్పటి వరకూ సంయమనం పాటించామని, ఇకపై మాత్రం ఆ నియంత్రణలు ఉండబోవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం మరింత మహోగ్రరూపం దాల్చుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam