Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇథనాల్ శాతాన్ని పెట్రోల్ బంకులు వెల్లడించాలా? పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఇథనాల్ శాతాన్ని పెట్రోల్ బంకులు వెల్లడించాలా? పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Telugu Samayam 2 weeks ago

పెట్రోల్ కొనుగోలు చేసినప్పుడు అందులో ఎంత శాతం ఇథనాల్ (Ethanol) ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రస్తుతం పెట్రోల్ బంకులు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది.

ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద పెట్రోల్‌లో కలిపిన ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా బహిర్గతం చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, పిటిషనర్ ఈ అంశాన్ని సంబంధిత అధికారిక సంస్థల దృష్టికి తీసుకెళ్లవచ్చని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. న్యాయమూర్తులు జస్టస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.బి. వరాలేలతో కూడిన ధర్మాసనం లాయర్ నరేంద్ర కుమార్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది.

పెట్రోల్ బంకుల్లో (Petrol Pumps) ఉండే నాజిల్స్‌పై ఇథనాల్ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని, ఇంధనం కొనుగోలు చేసిన బిల్లులు, రశీదులపై శాతాన్ని విధిగా ప్రింట్ చేయాలని, వివిధ వాహనాల తయారీ, మోడల్స్, ఇంజిన్ రకాలు, తయారీ సంవత్సరాల ఆధారంగా... ఏ వాహనానికి ఏ రకమైన ఇథనాల్ మిశ్రమం సరిపోతుందో తెలిపే డేటాబేస్‌ను రూపొందించాని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన E20 విధానాన్ని ఈ పిటిషన్ సవాలు చేయడం లేదని కోర్టుకు తెలిపారు. కస్టమర్లు తాము కొనుగోలు చేస్తున్న ఇంధనం గురించి పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు మాత్రమే కోరుతున్నామని, ప్రస్తుతం బంకుల్లో విక్రయిస్తున్న పెట్రోల్ E20 అవునో కాదో స్పష్టంగా తెలియడం లేదని వాదించారు.

అయితే ఆర్టికల్ 32 కింద ఈ ప్రజాప్రయోజన పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. పిటిషనర్ సంబంధిత అధికారిని లేదా సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.

ఇథనాల్ శాతం ఎందుకు కీలకం?

E20 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం సాధారణ పెట్రోల్ ఉంటాయి. భారత్ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, కర్బన ఉద్గారాలను అదుపు చేయడం, దేశీయంగా తయారయ్యే బయో ఫ్యూయల్ వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

కానీ, దీనిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ మిశ్రమానికి అనుగుణంగా లేని పాత వాహనాలు, కొత్త E20 వాహనాల్లా సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. మైలేజ్ తగ్గడం, ఫ్యూయల్ సిస్టమ్‌లో తుప్పు పట్టడం, సుదీర్ఘకాలంలో ఇంజన్ నిర్వహణ వంటి విషయాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వీటిపై స్పందించిన ప్రభుత్వం.. మైలేజ్ అనేది డ్రైవింగ్ అలవాట్లు, ట్రాఫిక్, వాహన నిర్వహణ, టైర్లలో గాలి ఒత్తిడి, ఏసీ వినియోగం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని గతంలో స్పష్టం చేసింది.

ఇటీవల భారత ఆటో మొబైల్ పరిశ్రమల సంస్థ (SIAM) నాణ్యత లేని ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల వాహనాలు దెబ్బతింటాయంటూ గతంలో ఇచ్చిన హెచ్చరికను ఉపసంహరించుకుని, తన వద్ద ఉన్న డేటాను సవరిస్తామని తెలిపింది. E20 ఇంధనంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు, తాము నిర్వహించిన పరీక్షల్లో E20 పెట్రోల్ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకే లోబడి ఉందని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పష్టం చేశాయి.

ఆహారం vs ఇంధనం చర్చ

ఇటీవల చక్కెర ధరలు భారీగా పెరగడంతో ఇథనాల్ తయారీ చెరుకును ఉపయోగించడంపై కూడా అనుమానాలు తలెత్తాయి. దీనిపై అంకుర్ సైంటిఫిక్ సంస్థ ఎండీ అంకుర్ జైన్ మాట్లాడుతూ.. 'భారతదేశం ఆహారం లేదా ఇంధనం రెండింటిలో ఒకదానిని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. 2G ఇథనాల్ విధానం ద్వారా వ్యవసాయ వ్యర్థాలు, బయోమాస్ అవశేషాల నుంచి ఇంధనాన్ని తయారు చేయడం ప్రారంభించవచ్చు. దీనివల్ల ఆహారం, నీటి సరఫరాపై అదనపు భారం పడకుండా దేశానికి ప్రత్యామ్నాయ ఇంధనం లభిస్తుంది' అని వివరించారు.

''ప్రపంచంలోని అనేక దేశాలు ఆహార పంటల నుంచి తయారుచేసే ఇథనాల్‌కు, వ్యర్థాల ఆధారిత ఇథనాల్‌కు మధ్య వ్యత్యాసాన్ని పాటిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్, యూకే దేశాలు ఆహార పంటలతో చేసే బయోఫ్యూయల్స్‌పై పరిమితులు విధిస్తూ.. వ్యర్థాల నుంచి తయారుచేసే అడ్వాన్స్‌డ్ ఫ్యూయల్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. అలాగే అమెరికా మొక్కజొన్న ఇథనాల్‌ను ఉపయోగిస్తూనే, వ్యవసాయ వ్యర్థాలతో తయారుచేసే 'సెల్యులోజిక్ ఇథనాల్'కు ప్రత్యేక విధానాలు, రాయితీలు ఇస్తోంది'' అని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆహార భద్రతకు భంగం కలిగించకుండా, వ్యర్థాలు, బయోమాస్ అవశేషాలను మెరుగ్గా వినియోగించుకునే ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయని ఆయన వివరించారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam