జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం (మే 3) విస్తుపోయే సంఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా ఓ వివాహిత మృతదేహాన్ని అత్తింటి వారి ఇంట్లోనే గుంత తవ్వి పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది.
వంజరివాడకు చెందిన ఈ కుటుంబంలో ఆస్తి చిచ్చు చివరికి ఒక మృతదేహం సాక్షిగా రసాభాసగా మారింది. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వంజరివాడకు చెందిన రాములు, శారద దంపతుల కుమారుడు రాజు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి రాజు భార్య మాధురి, తన కుమారుడు ధీరజ్‌తో కలిసి కరీంనగర్‌లోని సోదరుడి వద్ద నివసిస్తున్నారు.
అయితే.. జగిత్యాలలోని తన ఆస్తిని కోడలికి కాకుండా తన కుమార్తెలకు ఇవ్వాలని అత్త శారద నిర్ణయించుకున్నారు. దీంతో చాలా రోజులుగా శారద, మాధురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే.. మాధురి శనివారం రాత్రి అనారోగ్యంతో మరణించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. ఆదివారం మాధురి మృతదేహాన్ని ఆమె సోదరులు జగిత్యాలలోని అత్తింటికి తీసుకొచ్చారు. తన సోదరి కుమారుడు ధీరజ్ పేరిట ఆస్తిని రాయాలని వారు పట్టుబట్టారు. అందుకు అత్త శారద నిరాకరించడంతో ఆగ్రహించిన మాధురి బంధువులు.. ఆస్తి ఇవ్వకపోతే మృతదేహాన్ని ఇక్కడే పూడ్చిపెడతాం అంటూ ఏకంగా ఇంట్లోనే గుంత తవ్వడం మొదలుపెట్టారు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గంటల తరబడి సాగిన చర్చల అనంతరం.. చివరికి అత్త శారద తన ఆస్తిని మనవడు ధీరజ్ పేరిట రాసిచ్చేందుకు అంగీకరించారు. దీంతో మాధురి బంధువులు ఆందోళన విరమించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్లారు. ఆస్తి వ్యామోహం మనుషుల మధ్య సంబంధాలను ఎలా దిగజారుస్తుందో ఈ సంఘటన అద్దం పడుతోంది. కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మనవడికి కాకుండా ఆస్తిని కూతుళ్లకు రాసేందుకు శారద ప్రయత్నించటం దుర్మార్గమని స్థానికులు మండిపడుతున్నారు. వారసుడు మనవడే కాబట్టి అతని పేరు మీదే ఆస్తి రాయాలని అంటున్నారు.

