కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వర్తిసున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందు ఆయన నటించిన సినిమా 'జన నాయగన్'.
ఇదే ఆయన కెరీర్‌లో ఆఖరి సినిమా అని ప్రకటించారు. ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజుకు లైన్ క్లియర్ అవుతున్నట్లు తెలుస్తోంది.
విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో 'జన నాయగన్' మూవీ తెరకెక్కింది. తెలుగులో 'జన నాయకుడు' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 2026 సంక్రాంతికి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు డేట్ కూడా ఇచ్చారు. గతేడాది డిసెంబర్ లో మేకర్స్ ఈ సినిమాను సెన్సార్ బోర్డ్‌కు పంపించారు. అయితే మూవీలో కొన్ని వివాదాస్పద రాజకీయ అంశాలు, సంభాషణలు ఉన్నాయనే కారణాలతో సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో జన నాయగన్ విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత కోర్టు కేసులు, తదనంతర పరిణామాలతో ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేకుండా పోయింది. దాదాపు 7 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సెన్సార్ సమస్యలు పరిష్కారం అయ్యాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
'జన నాయగన్' చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వారు 'A' సర్టిఫికేట్ జారీ చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఈ జూలైలోనే సినిమా థియేటర్లలో విడుదల కానుందని పేర్కొన్నారు. మరోవైపు సీఎం విజయ్ సినిమాకి త్వరలోనే క్లియరెన్స్ సర్టిఫికేట్ రాబోతుందని, 'A' సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు. వీటిల్లో ఏది నిజమో తెలియదు కానీ.. 'జన నాయగన్' సెన్సార్ ప్రక్రియ జరుగుతోందనే మాట సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
'జన నాయగన్' మూవీని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. దళపతి చివరి సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతోందని ఆయన అభిమానులు గ్రాండ్ సెలెబ్రేషన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నారు.
* 'కరుప్పు'లో సూర్య కంటే ముందు సీఎం విజయ్.. అసలు విషయం బయటపెట్టిన ఆర్జే బాలాజీ

