తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఒక న్యాయం, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో కేంద్రం, దర్యాప్తు సంస్థలు ఎందుకు ఉదాసీనంగా వ్యహరిస్తున్నాయని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేసుల విషయంలో కోర్టులు చొరవ తీసుకుని విచారణ చేయాలని కోరారు. రాజకీయ ఒత్తిడి కారణమనే అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయని వ్యాఖ్యానించారు.
ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 20 లక్షల పెట్టుబడులు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటోందని.. క్షేత్రస్థాయిలో మాత్రం అభివృద్ధి కనిపించడం లేదన్నారు చింతా మోహన్. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి ఏం చేశారో అక్కడి ప్రజలకు చెప్పాలన్నారు.. ఇకనైనా మాటలు కాకుండా పనులు చేయాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు అత్యుత్సాహంతో అమాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రశ్న రావణ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత విశాల హృదయంతో ఆలోచించాలని.. ఆయన తెలిసో, తెలియకో నోరు జారి ఉంటారన్నారు చింతా మోహన్. ఆంధ్రప్రదేశ్‌లో 2029లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్తుందన్నారు.
అయోధ్య రామమందిరం పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని.. ఈ అంశంపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు మోహన్. అప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయని.. అయోధ్యలో దేవుడి పేరుతో జరిగిన నిధుల దుర్వినియోగంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఇజ్రాయిల్ పర్యటనకు ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏ అంశాలపై చర్చించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభావంతో నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. గాజాలో చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నా భారత విదేశాంగశాఖ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు చింతా మోహన్.

