ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోపవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ..కరెంట్ షాక్ కొట్టి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
అల్లవరం మండలంలోని ఓడలరేవులో ఈ ఘటన చోటుచేసుకుంది. బెండమూర్లంకకు చెందిన ప్రేమ్ కుమార్ అనే 23 ఏళ్ల యువకుడు ఓడలరేవులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అనంతపురంలోని పెనుగొండలో ఉన్న కియా కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. అయితే తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామం వచ్చిన ప్రేమ్ కుమార్.. మంగళవారం రాత్రి వేళ ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. చుట్టుపక్కల వారు వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించగా.. ప్రేమ్ కుమార్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ప్రేమ్ కుమార్ మృతదేహాన్ని అమలాపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
అమలాపురం ఘటన.. కలిచివేసిందన్న పవన్ కళ్యాణ్..
మరోవైపు అమలాపురం ఘటన కలిచివేసిందని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌కు గురై రోళ్ల ప్రేమ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ట్వీట్ చేశారు. ప్రేమ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని.. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. జీవితం ఎంతో అమూల్యమైనదని.. వేడుకలు, ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.నిర్మాత ఎస్‌కేఎన్ ఆర్థిక సాయం..
మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమాని మృతిపై నిర్మాత ఎస్‌కేఎన్ స్పందించారు. రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. తాను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నానన్న ఎస్కేఎన్.. ఒక అభిమాని బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఆయన అభిమాని ప్రేమ్ కుమార్.. ఇలా దూరం కావటం బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. ప్రేమ్ కుమార్ కుటుంబానికి ఓ అభిమానిగా, ఒక మనిషిగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నానని.. వారి బాధను తీర్చలేకపోయినా, తన వంతుగా రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఎస్‌కేఎన్ ప్రకటించారు.
