Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జో రూట్‌కు ఏమైంది? బలహీనత పసిగట్టిన బౌలర్లు.. వరుసగా ఒకే తరహాలో ఔట్..!

జో రూట్‌కు ఏమైంది? బలహీనత పసిగట్టిన బౌలర్లు.. వరుసగా ఒకే తరహాలో ఔట్..!

Telugu Samayam 5 days ago

టెస్ట్ క్రికెట్‌లో పరుగుల యంత్రంగా పేరుగాంచిన ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ విచిత్రమైన రికార్డును నమోదు చేస్తున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా అతడిని ఎల్‌బీడబ్ల్యూ డిస్మిసల్స్ తీవ్రంగా సతమతం చేస్తున్నాయి.

తాజా స్టాట్స్ ప్రకారం, రూట్ ఆడిన గత 12 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఏకంగా 9 సార్లు ఎల్‌బీడబ్ల్యూ (LBW)గానే పెవిలియన్ చేరాడు. మిగిలిన 3 ఇన్నింగ్స్‌లలో ఒకసారి క్యాచ్ బిహైండ్, ఒకసారి క్యాచ్ అండ్ బౌల్డ్, ఒకసారి రన్ అవుట్ అయ్యాడు.

2026 ఇంగ్లీష్ సమ్మర్ సీజన్ జో రూట్‌కు టెక్నికల్‌గా పెద్ద పరీక్షగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ నుంచి మొదలైన ఈ ఎల్‌బీడబ్ల్యూ సిరీస్, ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్ వరకు కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో వరుసగా ఎల్‌బీడబ్ల్యూ అయిన రూట్, ఆ తర్వాత పాకిస్థాన్‌తో సిరీస్‌లో ఖుర్రం షెహజాద్, మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ అలీ బౌలింగ్‌లలో వికెట్ల ముందు దొరికిపోయాడు.

లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత టెస్టులో రూట్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఎల్‌బీడబ్ల్యూగానే వెనుదిరగడం.. అభిమానులను విస్మయానికి గురిచేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మహమ్మద్ అబ్బాస్ బౌలింగ్‌లో, రెండో ఇన్నింగ్స్‌లో మహమ్మద్ అలీ విసిరిన ఇన్-స్వింగర్‌కు రూట్ ప్యాడ్లకు బంతి తగలడంతో అంపైర్ ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించాడు. ఫ్రంట్ ఫుట్ మీదకు వచ్చి ఆడే క్రమంలో బంతి ఇన్-స్వింగ్ లేదా ఇన్-డిప్ అయినప్పుడు రూట్ టైమింగ్ తప్పి వికెట్ల ముందు దొరికిపోతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఏళ్ల తరబడి ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్న జో రూట్ లాంటి ఆటగాడికి ఇలా వరుసగా ఎల్‌బీడబ్ల్యూ కావడం అరుదైన విషయమే. ప్రత్యర్థి జట్లు రూట్ బ్యాటింగ్ స్టాన్స్, ఫ్రంట్ ఫుట్ మూవ్‌మెంట్‌ను పక్కాగా అధ్యయనం చేసి అతడిని టార్గెట్ చేస్తున్నాయి. ఇంగ్లాండ్ రాబోయే సిరీస్‌లలో ఆధిక్యం సాధించాలంటే రూట్ తన ఫుట్‌వర్క్, డిఫెన్సివ్ టెక్నిక్‌ను త్వరగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సచిన్ టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేయాలంటే.. రూట్ తన బలహీనత నుంచి బయటపడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam