Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జోస్ ది బాస్.. ప్రపంచ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బట్లర్..!

జోస్ ది బాస్.. ప్రపంచ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బట్లర్..!

Telugu Samayam 2 weeks ago

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ వైట్ బాల్ బ్యాటర్లలో ఒకడైన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్‌ను అధిగమించి, టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

'ది హండ్రెడ్' లీగ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బట్లర్, వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఈ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డును సాధించాడు.

ఈ మ్యాచ్‌లో బట్లర్ కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మార్కో జాన్సెన్ వేసిన ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది పొలార్డ్ పేరిట ఉన్న 14,803 పరుగుల రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం బట్లర్ ఖాతాలో 522 టీ20 మ్యాచ్‌లలో 14,833 పరుగులు ఉన్నాయి. ఇందులో 9 సెంచరీలు, 105 అర్ధసెంచరీలు ఉండగా, సగటు 36 మరియు స్ట్రైక్ రేట్ 147గా ఉంది.

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాను పరిశీలిస్తే.. 14,833 పరుగులతో జోస్ బట్లర్ అగ్రస్థానంలో నిలవగా, 14,803 పరుగులతో కీరన్ పొలార్డ్ రెండో స్థానానికి చేరాడు. ఆ తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (14,562), ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (14,449), ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ (14,284) తదుపరి స్థానాల్లో ఉన్నారు. టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ 14,218 పరుగులతో ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో జేమ్స్ విన్స్ (13,777), షోయబ్ మాలిక్ (13,571), క్వింటన్ డికాక్ (12,654), రోహిత్ శర్మ (12,531) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


35 ఏళ్ల జోస్ బట్లర్ తన కెరీర్‌లో ఇంగ్లాండ్ జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్, బిగ్ బాష్, ది హండ్రెడ్, సీపీఎల్ వంటి ప్రముఖ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడి ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన బట్లర్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లీగ్ లీడర్‌గా ఎదిగాడు. పొలార్డ్‌తో పోలిస్తే దాదాపు 220కి పైగా తక్కువ మ్యాచ్‌లలోనే బట్లర్ ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam