ప్రముఖ శైవక్షేత్రం, దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం త్వరలో సరికొత్త వైభవాన్ని సంతరించుకోనుంది. దశాబ్దాల క్రితం నిర్మించిన పాత ఆలయాలు, మండపాలు, ప్రాకారాల స్థానంలో అత్యంత పటిష్టమైన, దీర్ఘకాలం మన్నేలా ఉండే శాశ్వత రాతి కట్టడాల నిర్మాణానికి దేవాదాయశాఖ శ్రీకారం చుట్టింది.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.198 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రకటించడమే కాకుండా.. పరిపాలనా అనుమతులను కూడా మంజూరు చేసింది. ఈ మహత్తర పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి గానూ.. ప్రస్తుతం ఆలయ ఆవరణలో ఉన్న పాత కట్టడాలను తొలగించేందుకు దేవాదాయశాఖ అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి గత నెల ఏప్రిల్ 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాళేశ్వర క్షేత్రంలో భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జూన్ చివరి వారంలో పాత నిర్మాణాల తొలగింపు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ఆలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో 1982 సంవత్సరానికి ముందు పూర్వకాలం నాటి ఆలయాలు ఉండగా.. వాటిని తొలగించి అప్పట్లో నూతన కట్టడాలు చేపట్టారు. ఆ తర్వాత శృంగేరి పీఠాధిపతుల సమక్షంలో జీర్ణోద్ధరణ, మహా కుంభాభిషేకం నిర్వహించారు. అయితే ఆ సమయంలో నిర్మించిన ఆలయాలు, చుట్టుపక్కల ఉన్న ప్రాకారాలు ప్రస్తుతం పూర్తిగా మరమ్మతులకు లోనయ్యాయి. దీంతో భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత రాతి నిర్మాణాల కోసం దేవాదాయశాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
కాళేశ్వర క్షేత్రానికి శృంగేరి శారదా పీఠంతో అత్యంత పురాతన, ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మహా పునర్నిర్మాణ ప్రక్రియకు శృంగేరి పీఠం నుంచి దేవాదాయశాఖ ముందస్తు అనుమతులు పొందినట్లు సమాచారం. అయితే, ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కొన్ని కొత్త కట్టడాలను సైతం మాస్టర్ ప్లాన్ డిజైన్ కోసం తొలగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. యముడు, శివుడు కొలువై ఉన్న ప్రధాన గర్భాలయంతో పాటు శుభానంద దేవి ఆలయం, సరస్వతీ ఆలయం, అభిషేక మండపం, అనివెట్టి మండపం, రెండు కల్యాణ మండపాలు, చుట్టూ ఉన్న ప్రాకార నిర్మాణాలన్నీ తొలగింపు జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. నలుదిక్కులా ఉన్న వైభోగ రాజగోపురాలను సైతం తొలగించి సరికొత్తగా నిర్మిస్తారనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది.
ఈ మహా ప్రాజెక్టుపై భక్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ.. కాలపరిమితిపై కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే 2027 జూలై నెలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల సమయానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు కాళేశ్వర క్షేత్రానికి తరలివస్తారు. ఈలోగా ఈ భారీ రాతి నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి కుంభాభిషేకం నిర్వహించడం సాధ్యమేనా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఏడాదిన్నర కాలం మాత్రమే సమయం ఉన్నందున పనుల్లో హడావుడి పెరిగి నిర్మాణ నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని స్థానికులు, నిపుణులు చర్చించుకుంటున్నారు.

