Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగోలో ఎబోలా కలకలం.. చికిత్సా కేంద్రంపై దాడి, పారిపోయిన 11 మంది రోగులు!

కాంగోలో ఎబోలా కలకలం.. చికిత్సా కేంద్రంపై దాడి, పారిపోయిన 11 మంది రోగులు!

Telugu Samayam 1 week ago

11 Ebola Patients Escape: ఆఫ్రికా ఖండంలో అత్యంత ప్రమాదకరంగా మారిన ఎబోలా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. కాంగో దేశంలో ఈ మహమ్మారి తీవ్రత మరింత ఆందోళనకరంగా మారగా..

అంతా హడలిపోతున్నారు. ముఖ్యంగా ఓవైపు వైరస్ శరవేగంగా విస్తరిస్తుండగా.. మరోవైపు ఐసోలేషన్ కేంద్రాల నుంచి బాధితులు పారిపోవడం, సహాయక బృందాలపై దాడులు జరగడం వంటి ఘోర పరిణామాలు అక్కడి పరిస్థితులను మరింత దిగజార్చుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు సైతం అప్రమత్తమై నిఘాను తీవ్రం చేశాయి.

అంత్యక్రియల బృందంపై దాడి.. రోగుల పరార్!

కాంగోలోని దక్షిణ కివు ప్రావిన్స్ పరిధిలో ఉన్న కటానా పట్టణంలో ఇటీవలే ఒక భయానక ఘటన వెలుగుచూసింది. ఎబోలా వైరస్ బారిన పడి మరణించిన ఒక వ్యక్తికి అధికారిక నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య బృందంపై స్థానిక మూకలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. ఈ ఆకస్మిక దాడితో భయాందోళనకు గురైన రక్షణ బృందం.. మృతదేహాన్ని అక్కడికక్కడే వదిలేసి ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయింది. అనంతరం స్థానికులే నేరుగా ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా మృతదేహాన్ని తాకడం వల్ల వైరస్ సమాజంలోకి మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని అక్కడి ఆరోగ్య అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ గందరగోళం ఇలా ఉండగానే.. ఇటూరి ప్రావిన్స్‌లోని ఎబోలా ప్రత్యేక చికిత్సా కేంద్రాల నుంచి 11 మంది రోగులు అధికారుల కళ్లు గప్పి పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. సాయుధ మూకలు కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ వైద్యులు, మానవతా స్వచ్ఛంద సంస్థల సేవలపై ఆంక్షలు విధిస్తూ ఆటంకాలు కలిగిస్తుండటంతో క్షేత్రస్థాయిలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తీవ్రరూపం దాల్చుతున్న మరణాల సంఖ్య..

కాంగో జాతీయ ప్రజారోగ్య సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 363 ఎబోలా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్‌లోని ప్రమాదకరమైన బుండిబుగ్యో వేరియంట్ కారణంగా దేశంలో ఇప్పటి వరకు 62 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే గత కొన్ని రోజులతో పోలిస్తే కొత్తగా వ్యాధి సోకిన బాధితులను గుర్తించే ప్రక్రియలో కొంత పురోగతి సాధించామని అధికారులు పేర్కొంటున్నారు. కాంగో సరిహద్దు దేశమైన ఉగాండాలో కూడా ఈ వైరస్ ప్రభావం కనిపిస్తోంది. అక్కడ ఇప్పటివరకు 15 కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రపంచ దేశాల హై అలర్ట్..!

ఆఫ్రికా దేశాలలో ఎబోలా వైరస్ విజృంభణ పతాక స్థాయికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలు, రవాణా కేంద్రాలు అప్రమత్తం అయ్యాయి. వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను నిశితంగా పరిశీలిస్తున్నారు. వైద్య నిపుణులు ఎయిర్‌పోర్టులలో ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రయాణికులలో ఎబోలా లక్షణాలు ఉన్నాయా లేదా అని తనిఖీలు నిర్వహిస్తూ కఠినమైన నిఘా చర్యలు చేపట్టారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam