Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాణిపాకం వినాయకుడికి భారీగా కానుకలు.. ఎన్ని లక్షలంటే.?

కాణిపాకం వినాయకుడికి భారీగా కానుకలు.. ఎన్ని లక్షలంటే.?

Telugu Samayam 2 weeks ago

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయకుడికి భారీగా కానుకలు అందాయి. తిరుపతి జిల్లాకు చెందిన ఓ భక్తుడు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామికి పెద్ద మొత్తంలో వెండి ఆభరణాలు కానుకగా సమర్పించారు.

తిరుచానూరుకు చెందిన సూర్యపవన్ అనే భక్తుడు.. కాణిపాకం వినాయకుడికి రూ.38 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు కానుకగా అందించారు.12 కిలోల వెండి సర్వాంగ కవచం, హస్తాలు, తొండం, కర్ణాలను తయారు చేయించి.. ఆలయానికి విరాళంగా అందజేశారు. శనివారం రోజు జరిగిన కార్యక్రమంలో.. కాణిపాకం పాలకమండలి ఛైర్మన్ వి. మణినాయుడు, ఈవో పెంచల కిశోర్‌ చేతికి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా దాత సూర్యపవన్‌ను ఆలయ అధికారులు అభినందించారు. సూర్యపవన్, ఆయన కుటుంబ సభ్యులకు వరసిద్ధి వినాయకుడి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వేదాశీర్వచనం చేసి.. తీర్థప్రసాదాలను అందజేశారు.

కాణిపాకం వినాయకుడి ఆలయంలో కొత్త ప్రసాదం..

సాధారణంగా బొజ్జ గణపయ్యకు ప్రీతికరమైనవి ఏవనగానే మనకు ఠక్కున మదిలో మెదిలేది ఉండ్రాళ్లు, కుడుములు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ఆహార పదార్థాలను ఆయనను దర్శించుకునే భక్తులకు కూడా ప్రసాదంగా అందించాలని కాణిపాకం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. గణేశుడికి ఇష్టమైన(మోదక ప్రసాదం) కుడుములను భక్తులకు అందించాలని దేవస్థానం పాలకమండలి భావిస్తోంది. కాణిపాకం వినాయకుడిని దర్శించుకునే భక్తులకు ప్రస్తుతం పులిహోర, లడ్డూ, వడలను ప్రసాదంగా అందిస్తున్నారు. ఈ జాబితాలో కుడుములను కూడా చేర్చాలని పాలకమండలి నిర్ణయించింది. ఈ విషయాన్ని కాణిపాకం పాలకమండలి ఛైర్మన్ మణినాయుడు ఇటీవల తెలిపారు.

కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలు

మరోవైపు సెప్టెంబర్ 14 నుంచి కాణిపాకంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ ఐదో తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల జరిగిన పాలకమండలి భేటీలో 21 పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. మరోవైపు సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రతి నెలా ఆలయంలో స్వర్ణ రథోత్సవ సేవ నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ సేవలో పాల్గొనే భక్తులు ఇక నుంచి ఐదు వేలు చెల్లించాలని పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నారు. మాడ వీధులు, క్యూ లైన్లలో భక్తులకు తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు గానూ.. సిబ్బందిని నియమించుకోవాలని పాలకమండలి భావిస్తోంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam