టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మరికొన్ని రోజుల్లో 'సిగ్మా' సినిమాతో ప్రేక్షకులను పలరించడానికి రెడీ అయ్యారు. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
జులై 31న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. సందీప్ తాజాగా 'శంబాల' మేకర్స్ తో తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఒకేసారి రెండు పార్ట్‌లు అనౌన్స్ చేయడమే కాదు, రెండింటినీ ఒకే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
'SK 33' అనే వర్కింగ్ టైటిల్ తో ఆ మధ్య భారీ ఫాంటసీ అడ్వెంచర్ మూవీని ప్రకటించారు సందీప్ కిషన్. ''కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు'' అంటూ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'కరికాల' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'ఎ మ్యాజికల్ వరల్డ్' అనేది దానికి ట్యాగ్ లైన్. 'శంబాల' ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
'కరికాల' ఫస్ట్ లుక్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఏఐ ద్వారా రూపొందించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సందీప్ కిషన్ కౌంటర్ ఇచ్చారు. ''ఎంత మాట .. ఎంత మాట'' అంటూ లుక్ టెస్టుకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతానికి BTS స్టిల్స్ మాత్రమే, పోస్టర్ లుక్ మేకింగ్ వీడియో రేపు రిలీజ్ అవుతుందని తెలిపారు.
దక్షిణ భారత చరిత్రలో కరికాల చోళుడుని కరికాలుడు అని పిలుస్తారు. అత్యంత ప్రసిద్ధి చెందిన చోళ రాజుల్లో ఆయన ఒకరు. క్రీస్తుశకం 1 - 2వ శతాబ్దం ప్రాంతంలో రాజ్యాన్ని పాలించినట్లు చరిత్రకారులు భావిస్తారు. హిస్టరీ ప్రకారం కరికాలుడు అనేక యుద్ధాల్లో విజయాలు సాధించి చోళ రాజ్యాన్ని విస్తరించాడు. కరికాలుడి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది 'కల్లణై' ఆనకట్ట (గ్రాండ్ అనికట్). తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో కావేరి నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట, ప్రపంచంలోనే అత్యంత పురాతన రాతి ఆనకట్టల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. నేటికీ చెక్కుచెదరకుండా నీటిపారుదల కోసం ఉపయోగంలో ఉన్న ఆనకట్టగా గుర్తింపు పొందింది. ఇప్పుడు సందీప్ కిషన్ సినిమాకి 'కరికాల' అనే టైటిల్ పెట్టడంతో.. కరికాల చోళుడి కథకి ఈ చిత్రానికి ఏమైనా సంబంధం ఉందా? అనే చర్చ ప్రారంభమైంది. ఇది కరికాలుడి కథేనా? లేదా మరేదైనా ఫిక్షనల్ క్యారక్టర్ తో రూపొందిస్తున్నారా? అనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

