తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, సినీ నటి త్రిషపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్..మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎట్టకేలకు పోలీసుల అరెస్ట్ నుంచి విడుదల అయ్యారు.
సెంగిపట్టి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతుగా డీఎంకే శ్రేణులు భారీగా తరలివచ్చి.. ర్యాలీగా స్వాగతం పలికారు. టీవీకే ప్రభుత్వం తనపై రాజకీయ కక్షసాధింపుకు పాల్పడుతోందని విడుదలైన తర్వాత ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు గుప్పించారు.
తన ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి తప్పుడు ఆరోపణలు చేసి తనను అరెస్ట్ చేశారని ఉదయనిధి స్టాలిన్తీవ్ర విమర్శలు చేశారు. తాను ఎలాంటి ఒత్తిళ్లకూ భయపడబోనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తంజావూరులో రైతులకు మద్దతుగా డీఎంకే నిర్వహించిన భారీ నిరసనలో తాను సుమారు 25 నిమిషాల పాటు ప్రసంగించానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కావేరి జలాల అంశం, మేకేదాటు ఆనకట్ట నిర్మాణంపై ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రమే తాను ప్రశ్నించానని చెప్పారు.
తన ప్రసంగానికి రైతుల నుంచి విశేష స్పందన రావడంతో.. తమిళనాడు అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరగకుండా విజయ్ప్రభుత్వం కుట్ర పన్నిందని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. తన అసలు ప్రసంగాన్ని కట్ చేసి.. ఎడిట్ చేసిన వీడియోను ప్రచారం చేస్తూ తాను మాట్లాడని మాటలను తనకు ఆపాదించారని మండిపడ్డారు. అదే ఎడిట్ చేసిన వీడియోను నేషనల్ మీడియాకు కూడా పంపించారని ఆరోపించారు.
తప్పుడు ఆరోపణల ఆధారంగా పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు వచ్చినప్పటికీ.. తాను పూర్తిగా సహకరించానని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. అరెస్ట్ సమయంలోనే ఈ వ్యవహారం పూర్తిగా అసత్యమని మీడియాకు చెప్పానని.. తాను ఎప్పుడూ మాట్లాడని వ్యాఖ్యలపై కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇక తాను కలైంజర్ కరుణానిధి మనవడిని అని.. ఎంకే స్టాలిన్ కొడుకుని అని.. ద్రావిడ మున్నేట్ర కళగం కార్యకర్తను అని.. ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రజల సమస్యల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.
ఉదయనిధి స్టాలిన్ విడుదల విషయం తెలిసిన వెంటనే డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున సెంగిపట్టి పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఉదయనిధి స్టాలిన్‌కు భారీ పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా అక్కడి నుంచి ఆయన బయలుదేరారు.

