ఇస్లామిక్ సహకార సంస్థ (OIC) సమావేశంలో జమ్మూ కశ్మీర్ ప్రస్తావనతో (Jammu And Kashmir Issue) ఆమోదించిన తీర్మానాన్ని భారత్ గట్టిగా తిరస్కరించింది.
తన రాజకీయ ఎజెండాను నెరవేర్చుకోవడానికి ఈ సంస్థను ఇస్లామాబాద్ వాడుకుంటోందని మండిపడిన న్యూఢిల్లీ.. కుట్రపూరితంగా ప్రేరేపించిన ప్రచారాన్ని ఓఐసీ అనుమతించడాన్ని తీవ్రంగా విమర్శించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ (MEA) ఓ ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల పాటు బాగ్దాద్‌లో జరిగిన OIC విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో ఆమోదించిన తీర్మానాల్లోని భారత్ వ్యతిరేక వ్యాఖ్యలను తోసిపుచ్చినట్లు ఎంఈఏ తెలిపింది.
''భారత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవి.. పక్షపాతంతో కూడినవి, అసత్యమైనవి. వీటిని పాకిస్థాన్ వెనుక ఉండి నడిపించింది. పాకిస్థాన్ తన సంకుచిత ఎజెండా కోసం ఓఐసీని మరోసారి దుర్వినియోగం చేయడానికి అనుమతించడం తీవ్ర విచారకరం'' అని ఎంఈఏ తన ప్రకటనలో తెలిపింది. భారత్ అంతర్గత అధికార పరిధిలోకి వచ్చే విషయాలపై వ్యాఖ్యానించే అర్హత ఓఐసీకి లేదని, జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది.
''మేము గతంలో చెప్పినట్లుగా భారత అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత OICకి ఎంతమాత్రం లేదు... జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగం. రాజకీయ ప్రేరేపిత ప్రచారాలు ఈ వాస్తవాన్ని ఏమాత్రం మార్చలేవు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటకం, కనెక్టివిటీ ద్వారా గణనీయమైన ఆర్థిక వృద్ధి నమోదైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా ఇక్కడ ఉంది. అక్కడ మహిళలు, పిల్లలతో సహా అనేకమంది పౌర నిరసనకారులపై హింస, అణచివేత, దౌర్జన్యాలకు పాల్పడుతూ పాకిస్థాన్ ప్రాణాలు తీస్తోంది'' అని విదేశాంగ శాఖ తెలిపింది.
ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినట్లు వివరించింది. పీఓకేలో పౌరులపై హింసాకాండ, దౌర్జన్యాలను కప్పిపుచ్చేందుకు మీడియా కవరేజ్‌పై పాక్ తీవ్ర ఆంక్షలు విధిస్తోందని విదేశాంగ శాఖ ఆరోపించింది. ''ఎంతగా మీడియాను అణచివేతకు గురిచేసినా అక్కడ జరుగుతున్న తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలను దాచలేరు'' అని తెలిపింది.
''జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి పరిష్కారం కావాల్సిన ఏకైక అంశం... తన అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను పాకిస్థాన్ ఖాళీ చేయడం.. సరిహద్దు ఉగ్రవాదానికి అందిస్తున్న మద్దతును వెంటనే నిలిపివేయడమే'' అని పేర్కొంది. పాకిస్థాన్‌లో మైనారిటీల వేధింపులు, మతపరమైన హింస, పాలనా వైఫల్యాలు, రాజకీయ అస్థిరత వంటి వాటి నుంచి అంతర్జాతీయ దృష్టిని మళ్లించడానికే ఇస్లామోఫోబియాతో సహా ఇతర కట్టుకథలను ప్రచారంలోకి తెచ్చిందని భారత్ కొట్టిపారేసింది.
''పాకిస్థాన్ ప్రచారం చేసే దురుద్దేశపూరిత కథనాలకు పదే పదే ఐఓసీ మద్దతు ఇవ్వడం దాని విశ్వసనీయత, సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. దాని సభ్య దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఈ సంస్థను ప్రక్షాళన చేస్తాయని మేం భావిస్తున్నాం'' అని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.

