Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆలోచించు'.. కవితపై ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

'కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆలోచించు'.. కవితపై ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telugu Samayam 5 days ago

బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తనపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి.. తన రాజకీయ ప్రస్థానం, బీఆర్‌ఎస్‌తో ఉన్న అనుబంధం, కేసీఆర్ కుటుంబంతో తన సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత వల్ల ఆమె తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆమె ఒక్కసారైనా ఆలోచించుకోవాలని ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.

కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై స్పందించిన ప్రశాంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్, కవిత మధ్య విభేదాలను పరిష్కరించేందుకు తాను ప్రయత్నించానని గుర్తు చేసుకున్నారు. వారిని విడదీయడానికి తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తాను ఏం చేశానో కేసీఆర్‌కు పూర్తిగా తెలుసని పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటిన తర్వాతే.. కవితపై బీఆర్ఎస్ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. తనపై వ్యక్తిగతంగా కవిత నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. స్వలాభం కోసం ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. తనపై చేసిన ఆరోపణలకు కవిత ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు.

బీఆర్‌ఎస్‌తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించిన ప్రశాంత్ రెడ్డి.. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి, తాను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ఆవిర్భావానికి ముందే ఉద్యమ రాజకీయాల్లో ఉన్నామని తెలిపారు. పార్టీ ప్రారంభ దశ నుంచి తమ కుటుంబం బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తోందని చెప్పారు. బీఆర్‌ఎస్ అంటే ప్రశాంత్ రెడ్డి.. ప్రశాంత్ రెడ్డి అంటే బీఆర్‌ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. కవిత మధ్యలోనే పార్టీలోకి వచ్చారని.. ఇప్పుడు మధ్యలోనే వెళ్లిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం, పార్టీ నిర్మాణంలో తమ కుటుంబం పోషించిన పాత్రను గుర్తు చేశారు.

ప్రస్తుతం బీఆర్‌ఎస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేసీఆర్‌కు అండగా ఎవరు నిలుస్తున్నారో కవిత తెలుసుకోవాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని గుర్తు చేశారు. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి విధానాలపై బీఆర్‌ఎస్ తరఫున తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ నేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నానని కవిత చేసిన ఆరోపణలను కూడా ప్రశాంత్ రెడ్డి ఖండించారు.

లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఉన్న తాను ఎవరితోనూ అలాంటి చర్చలు జరపలేదని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో కవిత కాంగ్రెస్ నాయకులతో రహస్యంగా సమావేశాలు నిర్వహించలేదని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నాయకులను కవిత టార్గెట్ చేస్తున్నారని ఆరోపించిన ప్రశాంత్ రెడ్డి.. ఇలా చేయడం ద్వారా బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని బలహీనపరిచే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. అది పరోక్షంగా అధికార కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుతోందని విమర్శించారు. అయితే తాను ఎవరినీ విడదీయడానికి ప్రయత్నించలేదని మరోసారి స్పష్టం చేశారు.

తాజాగా ఓ సభలో కవిత కన్నీళ్లు పెట్టుకోవడంపైనా స్పందించిన ప్రశాంత్ రెడ్డి.. అది రాజకీయ సానుభూతి కోసం చేసిన ప్రయత్నమా లేక మరేదైనా కారణమా అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తన సొంత తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌పై కవిత విమర్శలు చేసినప్పుడు తాను స్పందించలేదని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అలాంటప్పుడు తనను విమర్శించడం తనకు పెద్ద ఆశ్చర్యం కలిగించలేదన్నారు. అయితే కవిత చేస్తున్న వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని పేర్కొన్నారు.

కవిత రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో తన పాత్ర ఏమిటో కేసీఆర్‌కు తెలుసని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. మొన్నటి వరకు కవితను కేసీఆర్ కుమార్తెగా గౌరవించానని.. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో తనపై ఉన్న గౌరవాన్ని ఆమె కోల్పోయారని వ్యాఖ్యానించారు. కవితపై బీఆర్ఎస్ తీసుకున్న చర్యలకు కూడా ప్రశాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. పార్టీ నిర్ణయాలు, పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగానే ఆమెపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇది వ్యక్తిగత కక్షతో తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam