ప్రముఖ శాస్త్రవేత్త మేడమ్ మేరీ క్యూరీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి ఏడాది నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తారు.
క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడం, నివారణా పద్ధతులపై ప్రజల్లో చైతన్యం తేవడమే దీని ముఖ్య ఉద్దేశం. క్యాన్సర్ చికిత్స అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అని మనకు తెలిసిన విషయమే. అయితే, ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? భారతీయ పరిస్థితుల్లో ప్రధాన సవాళ్లు ఏంటి? అన్న పూర్తి వివరాలు డాక్టర్ శ్రీనివాస బి జె, (సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ ఆంకాలజీ, హెచ్‌సిజి క్యాన్సర్ హాస్పిటల్, కె ఆర్ యూనిట్, బెంగళూరు) అందించారు.
డాక్టర్ ఏం చెప్పారు?

1. భవిష్యత్ చికిత్సలో విప్లవాత్మక ఆవిష్కరణలు
- పర్సనలైజ్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్లు (Personalised mRNA Vaccines): ప్రస్తుతం అత్యంత వేగంగా పరిశోధనలు జరుగుతున్న విభాగం ఇది. కోవిడ్ వ్యాక్సిన్లలో వాడిన ఎం-ఆర్‌ఎన్‌ఏ (mRNA) సాంకేతికతను క్యాన్సర్‌కు కూడా అన్వయిస్తున్నారు. ప్రతి వ్యక్తి శరీరంలోని ట్యూమర్ కణాల జన్యు నిర్మాణం భిన్నంగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్లు ఆ నిర్దిష్ట ట్యూమర్ లక్షణాల్ని గుర్తించేలా రోగి వ్యాధి నిరోధక వ్యవస్థకు ముందే శిక్షణనిస్తాయి. దీనివల్ల శరీరం సొంతంగా క్యాన్సర్ కణాలపై దాడి చేసి వాటిని అంతం చేస్తుంది.
- రేడియో ఫార్మాస్యూటికల్స్ (Radiopharmaceuticals): సాధారణ రేడియేషన్ థెరపీలో సమీపంలోని ఆరోగ్యకరమైన కణజాలం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ రేడియో ఫార్మాస్యూటికల్స్ ద్వారా రేడియేషన్‌ను ఒక గైడెడ్ మిస్సైల్‌లా నేరుగా క్యాన్సర్ కణాల పైకే ప్రయోగిస్తారు. శరీరంలోని మిగిలిన భాగాలకు నష్టం కలగకుండా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.
- లిక్విడ్ బయాప్సీ (Liquid Biopsies): గతంలోలా శరీర భాగాన్ని కోసి ముక్క తీసే శస్త్రచికిత్సా బయాప్సీ కాకుండా, కేవలం రక్త నమూనా ద్వారా రక్తంలో తిరుగుతున్న ట్యూమర్ డీఎన్‌ఏ (Circulating Tumor DNA - ctDNA)ను విశ్లేషించి క్యాన్సర్‌ను అత్యంత ప్రారంభ దశలోనే పసిగట్టే మార్గం.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెసిషన్ మెడిసిన్: రోగి జన్యు పరీక్షల ఆధారంగా అతనికి ఏ మందు సరిగ్గా పనిచేస్తుందో ముందే నిర్ణయించడానికి AI గణాంకాలు, ప్రెసిషన్ మెడిసిన్ ఉపయోగపడతాయి.
2. సాంకేతికతతో పాటు ప్రాథమిక అంశాల ప్రాముఖ్యత
ఎంత అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా క్యాన్సర్‌ను జయించడంలో కొన్ని ప్రాథమిక సూత్రాలు ఎప్పటికీ మారవు:- ముందస్తు గుర్తింపు: వ్యాధి మొదటి లేదా రెండవ దశలోనే గుర్తిస్తే నయమయ్యే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి.
- ఖచ్చితమైన పాథాలజీ విశ్లేషణ: కణితి రకాన్ని, దశను కచ్చితంగా తేల్చడం సరైన చికిత్సకు పునాది.
- మల్టీ-డిసిప్లినరీ సమన్వయం: సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజిస్టులు, పాథాలజిస్టులు ఒక బృందంగా పనిచేసి రోగికి సరైన చికిత్సా ప్రణాళికను సిద్ధం చేయాలి.
- సాంకేతికత కేవలం సహాయకారి మాత్రమే: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఇతర పరికరాలు వైద్యుడి క్లినికల్ నైపుణ్యానికి సహాయంగా ఉండాలే తప్ప, వైద్యుడి నిర్ణయాధికారాన్ని భర్తీ చేయలేవు.

3. భారతీయ పరిస్థితుల్లో ప్రధాన సవాళ్లు - గ్రామీణ విస్తరణ
భారతదేశంలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి అతిపెద్ద సవాలు ఏంటంటే ఈ అధునాతన వైద్య సదుపాయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్-2, టైర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంత రోగులకు కూడా అందుబాటులోకి రావాలి. గ్రామ స్థాయిల్లో అవగాహన సదస్సులు, విస్తృత స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయడం అత్యవసరం.కేవలం కణితిని తొలగించడమే కాకుండా, క్యాన్సర్ సర్వైవర్లలో:
- పునరావాసం (Rehabilitation)
- సరైన పోషకాహార మద్దతు (Clinical Nutrition)
- మానసిక కౌన్సిలింగ్ (Psychological Health)
- జీవన నాణ్యత మెరుగుపరచడం (Quality of Life) వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులు
డాక్టర్ శ్రీనివాస బి జె
సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ ఆంకాలజీ,
హెచ్‌సిజి క్యాన్సర్ హాస్పిటల్, కె ఆర్ యూనిట్, బెంగళూరు.

