భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓ దశలో భారత్ ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ సోనాల్ దినూష అద్భుత పోరాటంతో శ్రీలంక ఓటమి నుంచి తప్పించుకుంది. డ్రాతో గట్టెక్కింది.
అయితే ఈ టెస్టు ఫలితంపై టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచులో గనక టీమిండియా తరఫున కోహ్లీ ఆడి ఉంటే కథ వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు. కోహ్లీ తన వ్యూహాలతో ప్రత్యర్థి ఆటగాళ్లను బుట్టలో వేసుకునేవాడని పేర్కొన్నాడు.
"టెస్ట్ క్రికెట్ ఆడటం అందరి వల్ల కాదు! ఇది చాలా సుదీర్ఘమైన ఫార్మాట్. మైదానంలో నిరంతరం కష్టపడుతూ బౌలింగ్ చేస్తూనే ఉండాలి. ఐదో రోజు భారత జట్టు మ్యాచ్‌ను చాలా తేలిగ్గా తీసుకున్నట్లు అనిపించింది. 'పిచ్ బాగా తిరుగుతోంది కదా, బంతి విసిరితే అదే వికెట్ పడిపోతుంది' అనే ధోరణిలో మనవాళ్లు బౌలింగ్ చేశారు తప్ప, వికెట్లు తీయడానికి తీవ్రంగా ప్రయత్నించలేదు" అని కైఫ్ విశ్లేషించాడు.
"ఒకవేళ విరాట్ కోహ్లీ గనుక ఈ మ్యాచ్ ఆడి ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. కోహ్లీ నిరంతరం అరుస్తూ, సర్ఫరాజ్, జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూ జట్టును ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచేవాడు. అంతేకాకుండా, గంటల తరబడి బ్యాటింగ్ చేస్తున్న సోనాల్ దినూషను కూడా తన మాటలతో, అగ్రెషన్‌తో ఒత్తిడిలోకి నెట్టేవాడు. మనం మైదానంలో లాహిరు కుమారతో గొడవపడ్డాం కానీ, అసలు వికెట్ పడగొట్టాల్సిన దినూషను ఏమీ అనలేకపోయాం" అని మహమ్మద్ కైఫ్ తన మనసులోని మాటను చెప్పాడు.
కొలంబో టెస్టు చివరిరోజు భారత్ నాలుగు వికెట్లు పడగొట్టి ఉంటే గెలిచేదే. కానీ చివరి వరకూ కేవలం 3 వికెట్లు మాత్రమే మన బౌలర్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. అయితే ఆటగాళ్లలో అగ్రెషన్ లేకపోవడం వల్లే.. శ్రీలంక లోయర్ ఆర్డర్ బ్యాటర్లు నిలదొక్కుకుని ఓటమి నుంచి తమ జట్టును తప్పించారని కైఫ్ పేర్కొన్నాడు. మే 2025లోనే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత ఆ ఫార్మాట్‌కు సైతం వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం భారత్ తరఫున కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.

