ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. అంతకంతకూ నీటిమట్టం పెరుగుతూ.. గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అధికారులు ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. శనివారం సాయంత్రానికి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటి మట్టం 13 అడుగులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 13.75 అడుగులు దాటితే.. రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు గోదావరి నదిలో వరద ఉద్ధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. తక్షణ సహాయం, సమాచారం అందించేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
వరద ఉధృతి నేపథ్యంలో సహాయం కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో 08856 - 293104 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే అమలాపురం మండలం ప్రజల కోసం 08856 - 233208 ఫోన్ నంబర్, రామచంద్రాపురం వాసుల కోసం 08857 - 245166 ఫోన్ నంబర్.. కొత్తపేట ప్రజల కోసం 85002 - 38258, 08855 - 244299 ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచారు.
ఆదివారం ఈ జిల్లాలలో వానలు..
గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పలు సూచనలు చేశారు. గోదావరిలో వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు, పరివాహక ప్రాంత ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే వాగులు, వంకలు, కాలువలను దాటే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
గోదావరిలో వరద ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే పాపికొండలు విహారయాత్రకు అధికారులు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. మారేడుమిల్లిలోని జలతరంగిణి, అమృతధార జలపాతాలను మూసివేశారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకూ జలపాతాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

