కోస్గి వేదికగా నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాంచజన్య సంకల్ప సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో ఈ సభ నిర్వహించడం కూడా రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది.
కోస్గి జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన సభలో కవిత తన రాజకీయ ప్రయాణం, బహుజన రాజకీయాలపై మాట్లాడటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కోస్గి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పాత జ్ఞాపకాలను ఈ సభలో కవిత ప్రస్తావించారు.
2009లో కోస్గి ఎన్నికల ప్రచారంలో తనతో పాటు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారని ఆమె గుర్తుచేశారు. వారిద్దరూ తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారని కవిత చెప్పడంతో సభలో కొద్దిసేపు 'సీఎం.. సీఎం' అంటూ నినాదాలు వినిపించాయి. తాను అప్పటి ఎన్నికల ప్రచారంలో మూడో వ్యక్తినని చెబుతూ.. కోస్గి జూనియర్ కాలేజీ సెంటిమెంట్, కొడంగల్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల ఆశీస్సులు తనపై ఉంటే.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన పార్టీదే అధికారమని కవిత ధీమా వ్యక్తం చేశారు.
అయితే తాను ముఖ్యమంత్రి అవుతానని ఆమె నేరుగా ప్రకటించకుండా.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి పేర్లను సభలో ప్రస్తావించి.. తన రాజకీయ ప్రస్థానాన్ని ఆ సెంటిమెంట్‌తో అనుసంధానం చేశారు. తనపై వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎస్ నేతలు తనను కాంగ్రెస్ విడిచిన బాణంగా అభివర్ణిస్తున్నారని.. అదే సమయంలో.. సీఎం రేవంత్‌రెడ్డి తనను కేసీఆర్ వదిలిన బాణంగా చెబుతున్నారని ఆమె అన్నారు. మరికొందరు బీజేపీ బాణమంటున్నారని పేర్కొంటూ.. తాను ఎవరి బాణాన్ని కాదని.. తెలంగాణ బహుజనుల బాణాన్ని అని ప్రకటించారు.
అధికారానికి, విద్యకు దూరంగా ఉన్న బహుజనుల కోసం తన పోరాటం కొనసాగుతుందని కల్వకుంట్ల కవిత చెప్పారు. యువత యుద్ధ నినాదం, మహాత్మా జ్యోతిబా ఫూలే ఆత్మగౌరవ భావన, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాలు, సావిత్రిబాయి ఫూలే ఆశయాల కోసం తాను ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. ఒక మహిళ ఎలాంటి రాజకీయ అండ లేకుండా కూడా రాజకీయంగా నిలబడగలదని నిరూపించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.
ప్రజలు తనకు మద్దతు ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అయినా.. సీఎం రేవంత్‌రెడ్డితో అయినా.. కేసీఆర్‌తో అయినా పోరాడతానని కవిత తేల్చి చెప్పారు. తెలంగాణలో రాజకీయాలు కేవలం పరస్పరం విమర్శలు, దూషణలకే పరిమితం కావద్దని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుత అసెంబ్లీ రాజకీయాల తీరును ప్రస్తావిస్తూ ప్రజా గాయకుడు గద్దర్ పాటలోని పంక్తులను ఆలపించారు. 'భలే గుందిరో మన అసెంబ్లీ..' అంటూ గద్దర్ పాటను గుర్తుచేసి ప్రస్తుత రాజకీయాలపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సభలో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
తెలంగాణ రైతుల సమస్యలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారు. రైతులకు నీళ్లు, యూరియా, ధాన్యం కొనుగోళ్ల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వరి, మొక్కజొన్న రైతుల పంటలను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడంపైనా కవిత మాట్లాడారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే పాలమూరులో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు భారీగా నిధులు ఖర్చు చేస్తామని ఆమె ప్రకటించారు.
దేశంలో మహిళలను మహారాణులుగా కీర్తిస్తున్నప్పటికీ.. వంటింట్లోని గిన్నెలపైనా పురుషుల పేర్లే కనిపిస్తున్నాయని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రాష్ట్రాల్లో మహిళల రాజకీయ ప్రాతినిధ్యం గురించి ప్రస్తావిస్తూ.. మహిళలు మరింతగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. బహుజనులు, మహిళలు, యువత రాజకీయంగా ఎదగడానికి తన పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. కోస్గి సభను తెలంగాణ రక్షణ సేన తన రాజకీయ విస్తరణలో కీలక కార్యక్రమంగా నిర్వహించింది. ఇప్పటికే నిజామాబాద్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించిన ఆ పార్టీ.. తదుపరి ఇంద్రవెల్లిలో కూడా సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

