ప్రపంచ క్రికెట్ అభిమానులకు 2027 సంవత్సరం ఉత్సాహభరితంగా ఉండనుంది. అభిమానులను కట్టిపడేసే దాదాపు అన్ని ప్రధాన అంతర్జాతీయ టోర్నీలు, సిరీస్‌లు ఒక్క ఏడాదే షెడ్యూల్ కావడంతో ఈ క్యాలెండర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ 2027, డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియాకప్, యాషెస్, వన్డే ప్రపంచకప్ 2027లతో 2027 సంవత్సరం మొత్తం బిజీగా ఉండనుంది. జనవరి నుంచి నవంబర్ వరకు ఏమాత్రం విరామం లేకుండా బ్యాక్-టు-బ్యాక్ ధనాధన్ క్రీడా సమరాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో అసలైన క్రికెట్ అభిమానులకు సిసలైన మజాను అందించనుంది.
2027 ఆరంభంలోనే జనవరి - మార్చి మధ్యకాలంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య ప్రతిష్టాత్మక 'బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ' పోరు జరగనుంది. ఆ వెంటనే మార్చి నుంచి మే నెల వరకు ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ 2027 అభిమానులను ఊపేయనుంది. ఆ తర్వాత జూన్ నెలలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ 2027) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
జూన్ - జూలై నెలల్లో వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ 2027 నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైతం పాల్గొననున్నారు. ఇక జూన్ నుంచి ఆగస్టు మధ్య ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య ఆల్‌టైమ్ క్లాసిక్ 'యాషెస్ సిరీస్ 2027' జరగనుంది. ఇక ఈ ఏడాదికి అసలైన ముగింపు ఆఫ్రికా ఖండంలో లభించనుంది. అక్టోబర్ - నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 జరగనుంది.
ఈ మెగా టోర్నీల క్యాలెండర్ విడుదలవ్వడంతో సోషల్ మీడియాలో క్రికెట్ ప్రేమికుల సందడి మొదలైంది. టెస్టుల క్లాసిక్ ఫైట్స్, టీ20ల లీగ్ వినోదం, వన్డే ప్రపంచకప్ ఉత్కంఠ.. ఇలా అన్ని రకాల ఫార్మాట్లలో అత్యుత్తమ క్రికెట్‌ను ఆస్వాదించేందుకు 2027 ఒక 'డ్రీమ్ ఇయర్'గా నిలవబోతోంది. దీంతో ఈ సంవత్సరంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

