Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్రిటికల్ మినరల్స్‌పై తెలంగాణ ఫోకస్.. ఆస్ట్రేలియా యూనివర్సిటీతో సింగరేణి, ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యం

క్రిటికల్ మినరల్స్‌పై తెలంగాణ ఫోకస్.. ఆస్ట్రేలియా యూనివర్సిటీతో సింగరేణి, ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యం

Telugu Samayam 4 days ago

తెలంగాణలో క్రిటికల్ మినరల్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాలకు అవసరమైన కీలక ఖనిజాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో..

తెలంగాణకు చెందిన సింగరేణి కాలరీస్, ఐఐటీ హైదరాబాద్, ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ మధ్య సహకారానికి మార్గం సుగమం అవుతోంది. పరిశోధన, ఆధునిక మైనింగ్ టెక్నాలజీ, ఖనిజాల ప్రాసెసింగ్, రిఫైనింగ్, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి.

క్రిటికల్ మినరల్స్ రంగంలో ఆస్ట్రేలియాతో కలిసి పనిచేయాలని సింగరేణి సంస్థను మోనాష్ యూనివర్సిటీ ఆహ్వానించింది. హైదరాబాద్‌లో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతితో మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం సమావేశమై ఈ రంగంలో ఉన్న అవకాశాలను వివరించింది. మోనాష్ యూనివర్సిటీ డీన్‌ (ఇంజినీరింగ్‌) ప్రొఫెసర్ యూనిస్ వెంటికోస్ నేతృత్వంలోని బృందం ఆస్ట్రేలియాలో క్రిటికల్ మినరల్స్ అన్వేషణ, వెలికితీత, ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న అవకాశాలను సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోందని మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధులు వివరించారు. అత్యాధునిక టెక్నాలజీ, పర్యావరణహిత మైనింగ్ పద్ధతులు, వాణిజ్యపరంగా ప్రయోజనకరమైన వ్యూహాలను అభివృద్ధి చేయడంలో తమ వర్సిటీ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. పరిశోధన ఫలితాలను కేవలం శాస్త్రీయ పరిధిలోనే కాకుండా.. పరిశ్రమలకు ఉపయోగపడే వాణిజ్య సాంకేతిక పరిష్కారాలుగా మార్చడంలో తమకు అనుభవం ఉందని వెల్లడించారు.

క్రిటికల్ మినరల్స్ విషయంలో కేవలం అన్వేషణ, వెలికితీతకే పరిమితం కాకుండా వాటి ప్రాసెసింగ్, రిఫైనింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సమావేశంలో చర్చించారు. ముడి ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించడం కంటే స్థానికంగానే ప్రాసెసింగ్, రిఫైనింగ్ వంటి కార్యకలాపాలను అభివృద్ధి చేస్తే అదనపు ఆర్థిక విలువను సృష్టించే అవకాశం ఉంటుందని మోనాష్ వర్సిటీ ప్రతినిధులు వివరించారు.

అలాగే సుస్థిర మైనింగ్, పర్యావరణ పరిరక్షణ, మైన్ క్లోజర్ ప్లానింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలను పరిశీలించారు. భవిష్యత్తులో క్రిటికల్ మినరల్స్ రంగంలో పరిశోధన, సాంకేతికత, విద్య, పరిశ్రమల అనుసంధానానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడే అవకాశం ఉంది.

ఇప్పటికే బొగ్గు గనుల రంగంలో సుదీర్ఘ అనుభవాన్ని కలిగి ఉన్న సింగరేణి ఇప్పుడు ఇతర ఖనిజాల అన్వేషణపైనా దృష్టి సారిస్తోంది. సింగరేణి సంస్థ తరఫున కర్ణాటకలో బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణ ప్రారంభించినట్లు ఆ సంస్థ అధికారులు మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధులకు వివరించారు. ఈ నేపథ్యంలో క్రిటికల్ మినరల్స్ రంగంలో అంతర్జాతీయ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి తెలిపారు.

మోనాష్ యూనివర్సిటీతో పరిశోధన, ఆధునిక సాంకేతికత, క్రిటికల్ మినరల్స్, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో భవిష్యత్ సహకార అవకాశాలను పరిశీలిస్తామని సింగరేణి సీఎండీ వెల్లడించారు. ఇందులో భాగంగా సింగరేణి ఉన్నతస్థాయి అధికారుల బృందాన్ని త్వరలో ఆస్ట్రేలియాకు పంపించి అక్కడి ఖనిజ వనరులు, మైనింగ్ టెక్నాలజీ, పరిశ్రమల భాగస్వామ్య అవకాశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలోనే క్రిటికల్ మినరల్స్ పరిశోధనను ప్రోత్సహించేందుకు మోనాష్ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, సింగరేణి కలిసి పనిచేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

ఖనిజాల అన్వేషణ నుంచి వెలికితీత, శుద్ధి వరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మైనింగ్ వ్యర్థాల నుంచి కూడా కీలక ఖనిజాలను తిరిగి పొందే అవకాశాలపై పరిశోధన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రిటికల్ మినరల్స్‌లో పరిశోధన, ఆవిష్కరణలకు తెలంగాణను ఒక కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఐఐటీ హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను బలోపేతం చేయడంతో పాటు పరిశోధన ఫలితాలను వాణిజ్య స్థాయిలో ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చడంపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల విషయంలో దేశీయ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి, ఐఐటీ హైదరాబాద్, మోనాష్ యూనివర్సిటీ మధ్య ఏర్పడే సహకారం తెలంగాణకు పరిశోధన, మైనింగ్ టెక్నాలజీ, ఖనిజ విలువ పెంపు రంగాల్లో కొత్త అవకాశాలను తీసుకురాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam