నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పెరగడంతో ఆలయం జలాధివాసంలోకి వెళ్లింది.
రోజురోజుకూ వరద నీరు పెరుగుతుండటంతో సంగమేశ్వర ఆలయం త్వరలోనే నీళ్లలో మునిగిపోయే పరిస్థితి. దాంతో పురోహితులు వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రఘురామ శర్మ గంగమ్మ తల్లికి భక్దిశ్రద్ధలతో చీర, సారె సమర్పించారు.
గతేడాది జూన్ 15వ తేదీనే సంగమేశ్వర స్వామి గర్భాలయంలోకి నీరు ప్రవేశించగా.. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన నీరు వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. గత సంవత్సరం జూన్ 15వ తేదీన స్వామివారు జలాధివాసం కాగా.. తిరిగి మార్చి నెలలో నీరు తగ్గి ఆలయం బయటపడింది. దాంతో అప్పటి నుంచి భక్తులు సంగమేశ్వర ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మార్చి నెల నుంచి ఆగస్టు వరకు మొత్తం 131 రోజుల పాటు ఈ ఏడాదిలో స్వామివారు పూజలు అందుకున్నారు అంటూ ప్రధాన అర్చకులు రఘురామ శర్మ తెలిపారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు పడవని అందరూ అనుకున్నారని.. కానీ పడమటి కనుమల్లో భారీ వర్షాలు నమోదయ్యి అన్ని జలాశయాలు నిండుకుండలా మారాయని తెలిపారు.
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. జూరాల ప్రాజెక్టు నుంచి వరద నీరు ప్రవహించి, అది శ్రీశైలం జలాశయానికి చేరుకుంది. రోజురోజుకూ వరద నీరు వచ్చి శ్రీశైలానికి చేరుకుంటుండటంతో ప్రస్తుతం నీటి మట్టం 838.20 అడుగులకు చేరుకుంది. జూరాల నుంచి భారీగా ఒక లక్ష 51 వేల 366 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 838.20 అడుగులకు చేరుకోగా, పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఆంధ్రలో కూడా వర్షాలు కురిస్తే శ్రీశైలం నిండుకుండలా మారడం ఖాయం.

