కాలం మారిపోయింది.. తల్లిదండ్రులు పిల్లల చదువుల విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అప్పు చేసైనా సరే పిల్లల్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూ్ల్స్‌లో చదివిస్తున్న రోజులివి.
కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు సైతం వారి పిల్లల్ని తీసుకెళ్లి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేరుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ జిల్లా కలెక్టర్ మాత్రం తన కుమారుడిని సర్కారు బడిలో చదివిస్తున్నారు. ఆయన ట్రాన్స్‌ఫర్‌పై ఎక్కడికి వెళ్లినా అక్కడే పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్‌లోనే చదివిస్తూ ఆదర్శంగా నిలిచారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకరరెడ్డి తన కుమారుడ్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఎన్.క్రిష్ ధరణ్‌రెడ్డి విజయవాడలోని పడమట జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదోతరగతి పూర్తిచేశాడు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పార్వతీపురంలో ఉన్న డాక్టర్ దిండిగల్ వెంకట్‌రావు మెమోరియల్ మున్సిపల్ స్కూల్‌లో కుమారుడ్ని పదోతరగతిలో చేర్పించారు. ఓ జిల్లా మేజిస్ట్రేట్ కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రశంసలు అందుకున్నారు.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్ కుమారుడు తమ స్కూల్‌లో చేరడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని హెడ్‌మాస్టర్ అంటున్నారు. గతంలో పార్వతీపురం ఐటీడీఏ పీవోగా పనిచేసిన కూర్మనాథ్ కూడా తన కుమారుడిని ఇదే డాక్టర్ దిండిగల్ వెంకట్‌రావు మెమోరియల్ పాఠశాలలోనే చదివించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రెడ్డి శాప్ ఎండీగా పనిచేశారు.. అప్పుడు ఇద్దరు పిల్లల్ని విజయవాడ పటమట జడ్పీ స్కూల్‌లో చేర్పించారు. అంతేకాదు అంతకముందు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలోనూ ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్ని చేర్పించడానికి ఆలోచించే రోజుల్లో జిల్లా కలెక్టర్ తన కుమారుడ్ని సర్కారు బడిలో చదివించడం నిజంగా గ్రేట్.. మీరు గ్రేట్ సార్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమాన్ని ప్రభాకర్ రెడ్డి ముందుగా ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్‌ను ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణను పెంపొందించడానికి ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించింది.

