Income Tax Rules: వ్యాపారంలో లేదా స్టాక్ మార్కెట్లలో లాభాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తుంది. మరి అదే నష్టాలు వస్తే ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా?
అనే సగటు భారతీయుడి మనసులో ఒక్కసారైన మెదిలే ఉంటుంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, చిన్న ఇన్వెస్టర్లలో ఈ ప్రశ్న తలెత్తుతుంటుంది. ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు ట్యాక్స్ నిపుణులు. నేరుగా చేతికి డబ్బులు ఇవ్వకపోయినా, పన్ను చట్టాల ద్వారా ప్రభుత్వం మీకు భారీ ఊరటకల్పిస్తుందని సీఏ దుర్గా అంజలి ఓ వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను చట్టంలో సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ (Set-Off and Carry Forward) అనే ప్రత్యేక రూల్ ఉంటుంది. దీనిని ఉపయోగించుకుని మీరు ఫ్యూచర్‌లో లాభాలపై పన్నును గణనీయంగా తగ్గించుకోవచ్చు. అది ఎలాగో సీఏ అంజలి మాటల్లో తెలుసుకుందాం.
'లాభాలు వస్తే ట్యాక్స్ కట్టించుకునే ఈ ప్రభుత్వం నష్టాలు వస్తే ఏమైనా హెల్ప్ చేస్తుందా అని చాలా మంది అనుకుంటారు. ప్రభుత్వం మీ సాయం చేస్తుంది. కానీ మీకు నష్టం వచ్చినప్పుడు ప్రాపర్‌గా చెప్పాలి. చెప్పకపోతే ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది. ఇప్పుడు మీకు నష్టం వచ్చిందనుకోండి మాకు బిజినెస్‌లో, ట్రేడింగ్‌లో ఇంత నష్టం వచ్చిందని మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో చూపిస్తే వచ్చే సంవత్సరం లాభాలు వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఎంత నష్టం వచ్చిందో అంత వరకు భర్తీ చేసి మిగిలిన దానికే ట్యాక్స్ కట్టించుకుంటారు. అందుకే నష్టం వచ్చినప్పుడు ఐటీఆర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పాలి.
ఇప్పుడు బిజినెస్‌లో రూ.10లక్షలను నష్టం వచ్చిందనుకో వచ్చే సంవత్సరం రూ.10 లక్షల లాభం వస్తే ట్యాక్స్ కట్టించుకోరు. పది లక్షలు దాటిన అమౌంట్ పైనే ట్యాక్స్ కట్టించుకుంటారు. ట్రేడింగ్ చేశారు లాస్ వచ్చింది ఇక్కడే సేమ్ ఉంటుంది. ఇలా బిజినెస్ లాస్ అయితే 8 ఏళ్ల వరకు చూపించుకోవచ్చు. హోమ్ లోన్ ఈఎంఐ కడుతుంటే దానిని నష్టాల కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. రెంటల్ ఇన్కమ్ వస్తుందనుకో దానిపై ట్యాక్స్ కట్టక్కర్లేదు. కొన్ని కొన్ని వ్యాపారాలకు పెట్టిన భారీ పెట్టుబడులను సైతం నష్టాల కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.' అని సీఏ దుర్గా అంజలి వివరాలు తెలియజేశారు.
ఈ బెనిఫిట్ పొందాలంటే చేయాల్సిన పని
నష్టాల ఆధారంగా పన్ను మినహాయింపు లేదా క్యారీ ఫార్వర్డ్ ప్రయోజనం పొందాలంటే మీరు కచ్చితంగా మీ ఐటీఆర్ ని గడువు తేదీలోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేస్తే క్యాపిటల్ గేయిన్స్ లేదా బిజినెస్ నష్టాలను వచ్చే సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయడానికి పన్ను శాఖ అనుమతించదు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం నేరుగా మీ నష్టానికి ఆర్థిక సాయం చేయకపోయినా చట్టబద్ధంగా పన్ను మినహాయింపులు ఇస్తూ మీ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. కాబట్టి నష్టాలు వచ్చాయని ఐటీఆర్ ఫైల్ చేయడం మానకండి.
