ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు ఒక ముఖ్యమైన ప్రమాదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది తల్లిపై మాత్రమే కాకుండా బిడ్డపై కూడా ప్రభావం చూపుతుంది.
దీనిని ముందుగానే గుర్తించకపోతే.. అది మాయకు రక్త ప్రసరణను తగ్గించి బిడ్డకు తగినంత ఆక్సిజన్, అవసరమైన పోషకాలు అందకుండా చేస్తుంది. ఇది తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, నెలలు నిండక ముందే ప్రసవం కావడం, మూర్ఛలు, ఇతర తీవ్రమైన సమస్యలకు దారితీయొచ్చు.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఇక, ఈ సమయంలో మంచి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి, బిడ్డ పెరుగుదల నిర్ధారణ వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెడతారు. అయితే, చాలా మంది బీపీ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే, గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు (బీపీ) కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతున్నాయి.
1970 నుంచి 35 ఏళ్లు పైబడిన గర్భిణీ స్త్రీల్లో బీపీ కేసులు 75 శాతం పెరిగాయని ఒక కొత్త అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ పర్యవేక్షణ చాలా ముఖ్యం. బీపీ పరీక్షలు ఎందుకు ముఖ్యమో డాక్టర్ అరవింద ఎస్ ఎన్ (ప్రధాన కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్, ఆస్టర్ ఆర్. వి హాస్పిటల్, బెంగళూరు) వివరించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ పరీక్షలు ఎందుకు ముఖ్యం?

గర్భధారణ సమయంలో తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరి ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో ముందస్తు జాగ్రత్తలు (Prenatal Care) చాలా కీలకం. అందులోనూ రక్తపోటును (BP) నిరంతరం పర్యవేక్షించడం అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. బీపీని నిర్లక్ష్యం చేస్తే ప్రీ - ఎక్లాంప్సియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గర్భం దాల్చినప్పుడు మహిళల శరీరంలో అనేక శారీరక మార్పులు జరుగుతాయి. అటువంటి సమయంలో రక్తపోటు పెరగడం అనేది ఒక తీవ్రమైన హెచ్చరిక కావచ్చు.
నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?

గర్భధారణ సమయంలో రక్తపోటు పెరగడం వల్ల 'జెస్టేషనల్ హైపర్‌టెన్షన్' (Gestational Hypertension), 'ప్రీ-ఎక్లాంప్సియా' (Preeclampsia) వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రీ - ఎక్లాంప్సియా అనేది ప్రాణాలకే ప్రమాదం కలిగించే వైద్య పరిస్థితి.
ఇందులో బీపీ విపరీతంగా పెరడమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలు ( ముఖ్యంగా కిడ్నీలు, లివర్ వంటివి) సరిగ్గా పనిచేయవు. ఇటువంటి పరిస్థితుల వల్ల నెలలు నిండకుండానే కాన్పు అవ్వడం (Preterm labor), శిశువు ఎదుగుదల లోపించడం, మాయ (Placenta) విడిపోవడం, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
ముందస్తు నిర్థారణ - నివారణ

- రెగ్యులర్ బీపీ పరీక్షల ద్వారా వైద్యులు ఎటువంటి లక్షణాలు కనిపించక ముందే ప్రమాద సంకేతాల్ని గుర్తించగలరు.
- సాధారణంగా కొందరిలో తీవ్రమైన తలనొప్పి, ముఖం, చేతులు వాపు రావడం, కంటిచూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- అయితే, చాలా మంది గర్భిణీల్లో ఎటువంటి లక్షణాలు బయటపడవు.అందుకే బీపీ పరీక్షలు తప్పనిసరి.
- ఈ పరీక్షల ద్వారా గర్భిణీ స్త్రీ శరీరం గర్భధారణ మార్పుల్ని ఎలా తట్టుకోగలుగుతుందో వైద్యులు అర్థం చేసుకుంటారు. దాన్ని బట్టి తదుపరి పరీక్షలు, మందులు, అదనపు పర్యవేక్షణ లేదా ఇతర చికిత్సా విధానాల్ని నిర్ణయిస్తారు.
ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?

- సాధారణ రక్తపోటు ఎంత ఉండాలి?: సాధారణంగా గర్భిణీలలో బీపీ 120/80 mm Hg ఉండాలి. ఒకవేళ అది 140/90 mm Hgలేదా అంతకంటే ఎక్కువ ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి.
- బీపీ పెరగడానికి గల కారణాలు: ఆలస్యంగా గర్భం దాల్చడం (35 ఏళ్లు పైబడిన వారు), ఊబకాయం (Overweight), అంతకుముందే బీపీ లేదా షుగర్ ఉండటం, కవల పిల్లలు కావడం వంటి కారణాల వల్ల ప్రెగ్నెన్సీలో బీపీ పెరగొచ్చు అని డాక్టర్ అంటున్నారు.
గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

- ఆహారంలో ఉప్పు (Salt) శాతాన్ని తగ్గించాలి.
- వైద్యుల సలహా మేరకు ప్రతిరోజూ తేలికపాటి నడక వంటి వ్యాయామాలు చేయాలి.
- మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి.
- ఇంట్లోనే ఒక డిజిటల్ బీపీ మిషన్ ఉంచుకుని వారానికి ఒకసారైనా తనిఖీ చేసుకోవడం మంచిది.
- తగినంత నిద్ర కూడా చాలా ముఖ్యం. రోజుకు 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.
- హైడ్రేషన్ కూడా చాలా ముఖ్యం. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తాగండి.
సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులు
డాక్టర్ అరవింద ఎస్ ఎన్
ప్రధాన కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్,
(ఆస్టర్ ఆర్. వి హాస్పిటల్, బెంగళూరు)

