Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. మరోసారి వడ్డీ రేట్ల పెంపు లేదు! ఆగస్టు 5న RBI నుంచి కీలక ప్రకటన!

లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. మరోసారి వడ్డీ రేట్ల పెంపు లేదు! ఆగస్టు 5న RBI నుంచి కీలక ప్రకటన!

Telugu Samayam 1 week ago

RBI MCP Meet: దేశంలోని కోట్లాది మంది రుణ గ్రహీతలకు శుభవార్త. బ్యాంకుల్లో తీసుకునే వివిధ రుణాల వడ్డీ రేట్ల పెంపు ఇప్పట్లో లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

రుణ గ్రహీతలు, బ్యాంకింగ్ రంగం, స్టాక్ మార్కెట్ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమీక్ష మూడు రోజుల సమావేశాలు ఆగస్టు 3వ తేదీన ప్రారంభమయ్యాయి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఆర్థిక వ్యవస్థలోని హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణంపై సమగ్రంగా చర్చించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, రిటైల్ ద్రవ్యోల్బణ సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే రుణాలు తీసుకున్న వారికి మరికొన్నాళ్ల పాటు ఊరట లభించనుంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు జూన్ 2026 నెలలో జరిగిన ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.రెపో రేటును 5.25 శాతం వద్దే స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చిన క్రమంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలను సవరించింది. ముందుగా అనుకున్న 4.6 శాతం నుంచి 5.1 శాతానికి సవరించింది. అలాగే జీడీపీ వృద్ధి అంచనాలను 6.9 శాతం నుంచి 6.6 శాతానికి మార్చింది. ఈ క్రమంలో ఈ ఆగస్టులో జరుగుతున్న భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరల్లో కనిపిస్తున్న అస్థిరత రాబోయే రోజుల్లో దేశీయ ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉంది. ఆహార పదార్థాల ధరల హెచ్చుతగ్గుల వల్ల ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యానికి లోబడి ఉంచడం ప్రధాన సవాలుగా మారింది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి సాధిస్తున్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్ మందగమనం వల్ల జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఆర్‌బీఐ బెంచ్ మార్క్ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగిస్తే బ్యాంకులు తమ హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను ఇప్పుడే పెంచవు. దీంతో ఈఎంఐల భారం పెరిగే అవకాశం ఉండదు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లభించే వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న గరిష్ఠ స్థాయిల్లోనే మరికొంత కాలం స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది.

మూడు రోజుల సమావేశంలో భాగంగా ఆగస్టు 5వ తేదీన ఎంపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించనున్నారు. వడ్డీ రేట్లలో మార్పు లేకపోయినా, రాబోయే త్రైమాసికాలకు సంబంధించిన ఆర్‌బీఐ వ్యక్తపరిచే ఆర్థిక దృక్పథం మార్కెట్లకు అత్యంత కీలకం కానుంది. ఈ క్రమంలో రుణాలు తీసుకున్న వారితో పాటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు సైతం ఆర్‌బీఐ నిర్ణయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam