New Rules From Sep 1: సాధారణంగా కొత్త నెల ప్రారంభవుతుంది అంటే కొన్ని ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించిన మార్పులు అమలులోకి వస్తాయి. ఆగస్టు నెల ముగించుకుని సెప్టెంబర్ 2026 నెలలోకి అడుగుపెడుతున్నాం.
ఈ క్రమంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పలు మార్పులను ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన గడువు తేదీల ముగింపులు సైతం ఉన్నాయి. ఈ విషయాలను తెలుసుకోకుండా ఉంటే పెనాల్టీలు కట్టాల్సి రావచ్చు.
ఎల్‌పీజీ గ్యాస్ ధరలు
ప్రతి నెల తొలి రోజున ఎల్‌పీజీ గ్యాస్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. అలాగే సెప్టెంబర్ 1వ తేదీన సైతం గృహ వినియోగ, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సమీక్షించనున్నాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్ ట్రెండ్ ఆధారంగా ధరలను మార్చవచ్చు. గత నెలలో కమెర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు విమాన ఇంధన ధరలను సైతం సమీక్షిస్తారు.ఎల్‌పీజీ గ్యాస్ కేవైసీ గడువు
గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు గడువు ఆగస్టు 31వ తేదీగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నిర్ణయించాయి. సెప్టెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ డెలివరీ, సబ్సిడీ పొందడంలో ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపాయి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వెంటనే కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.ఏటీఎం ఛార్జీల సమీక్ష
కొన్ని బ్యాంకులు తమ సేవల రుసుములు, ఏటీఎం విత్ డ్రాయల్ ఛార్జీలను ఒకటో తేదీన సవరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్‌బీఐ వంటి బ్యాంకులు ఏటీఎం సహా ఇతర సేవల ఛార్జీలను సవరించాయి. మరిన్ని బ్యాంకులు అదే దారిలో వెళ్లే అవకాశం ఉంది.బ్యాంక్ డిపాజిట్ రూల్స్
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజి్టలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన నిబంధనలు అమలులోకి రానున్నాయి. రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే బల్క్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు బ్యాంకులు ప్రచురించాల్సి ఉంటుంది. అన్ని బ్రాంచుల్లో ఒకే రకమైన వడ్డీ రేట్లు ఉండేలా చూడాలి. ఈ రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమలవుతాయి.ఐటీఆర్ ఫైలింగ్ గడువు
ఫైనాన్స్ యాక్ట్ 2026 ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌లో ప్రతిపాదించిన కొత్త మార్పుల ప్రకారం నాన్-ఆడిట్ వ్యాపారులు, నిపుణులు, ఫ్రీలాన్సర్లు తమ ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ఆగస్టు 31తో ముగుస్తుంది. ఒక వేళ ఈ గడువు దాటితే సెప్టెంబర్ 1 నుంచి ఫైల్ చేసే వారు పెనాల్టీలతో పాటు పన్ను బకాయిలపై పెనాల్టీలు కట్టాల్సి ఉంటుంది. రూ.1000 నుంచి రూ.5000 వరకు ఆలస్య రుసుములు చెల్లించాల్సి వస్తుంది.
