Dailyhunt
మా అమ్మను అవమానించారు.. బొత్స ఎంత ఏడ్చినా తక్కువే: వైఎస్ షర్మిల

మా అమ్మను అవమానించారు.. బొత్స ఎంత ఏడ్చినా తక్కువే: వైఎస్ షర్మిల

Telugu Samayam 2 days ago

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. విలేకర్ల సమావేశంలో బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టుకున్నారు.

అయితే ఈ ఘటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, నిండు సభలో తమ అమ్మ వైఎస్ విజయమ్మను అవమానించారని షర్మిల ఆరోపించారు. " నిండు సభలో విజయమ్మను అవమానించారు, వైఎస్ఆర్ చులకన చేసి మాట్లాడారు. విజయమ్మను నిండు సభలో కంటతడి పెట్టించారు. అమ్మ ఇంటికి వచ్చి చాలా బాధపడింది. ఇంతగా అమ్మను బాధ పెట్టాడు. ⁠విజయమ్మను బాధ పెట్టినందుకు ఆయనకు ఇది జరగాల్సిందే . ⁠విజయమ్మకు బొత్స బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే" అని షర్మిల అన్నారు.

మరోవైపు వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనపైనా షర్మిల స్పందించారు. వైఎస్ జగన్ పేరులోనే గన్ ఉందని విమర్శించిన షర్మిల.. అవినాష్ పేరులో వినాశనం ఉందంటూ సెటైర్లు గుప్పించారు. వైసీపీకి ఎంతసేపూ నాశనం చేయాలనే ఆలోచనలే ఉంటాయన్న షర్మిల.. నిర్మించాలని, కట్టాలనే ఆలోచన వైసీపీకి, వైఎస్ జగన్‌కు లేదన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికను కూల్చారని విమర్శించారు. ఇప్పుడేమో అమరావతి బదులు మావిగన్ అంటున్నారన్న షర్మిల.. జగన్, అవినాష్ పేరులోనే గన్, వినాశనం ఉన్నాయని విమర్శించారు.

వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన అద్భుతమైతే వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో గాడిదలు కాశారా అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు, మావిగన్‌కు తక్కువ ఖర్చు అయితే ఐదేళ్లు ఎందుకు అమలు చేయలేదని, మూడు రాజధానులు అని ఎందుకు అన్నారని ప్రశ్నించారు. ఐదేళ్లు జగన్ గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా లేక నిద్రపోయారా అని నిలదీశారు. ⁠మా నవ్వే మావిగన్ మీద తమ వైఖరికి అర్థమని.. ⁠మళ్లీ దీనిమీద కొత్తగా వైఖరి చెప్పడం అనవసరమని షర్మిల అన్నారు. అమరావతిపై కాంగ్రెస్ వైఖరి ఇప్పటికే స్పష్టం చేశామని.. ⁠పార్లమెంట్‌లోనూ మద్దతిచ్చామన్నారు. అమరావతికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని.. ఏ సహాయం కావాలన్న చేస్తామన్నారు.

మావిగన్ జోక్ అన్నందుకు వైసీపీ నేతలు తను కూటమికి దత్తపుత్రిక అని అంటున్నారన్న షర్మిల.. జగన్ మాత్రం బీజేపీకి దత్తపుత్రుడని విమర్శించారు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు కనుకనే తాము కూడా అలాగే పొత్తు పెట్టుకున్నట్లు వైసీపీ నేతలకు కనిపిస్తోందన్నారు. చంద్రబాబుతో అక్రమంగా పొత్తు పెట్టుకునే అవసరం తమకు లేదన్న షర్మిల.. తమకు కాంగ్రెస్ పార్టీ అని, వైఎస్ఆర్ లెగసీ ఉన్న పార్టీ అని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ ఐడియాలజీకి నిజమైన వారసులం తామేనని వైఎస్ షర్మిల మరోసారి స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam