Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న 'పుష్ప్' బ్రాండ్ IPO.. టార్గెట్ రూ. 1000 కోట్లు.. 74 లక్షల షేర్లు విక్రయం!

మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న 'పుష్ప్' బ్రాండ్ IPO.. టార్గెట్ రూ. 1000 కోట్లు.. 74 లక్షల షేర్లు విక్రయం!

Telugu Samayam 1 week ago

Pushp Brand IPO: మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీకు ఐపీఓల గురించి తెలిసే ఉంటుంది. చాలా వరకు ఐపీఓలు బాగా రాణిస్తుంటాయి.

మంచి ప్రీమియంతో లిస్టింగ్ అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. ఏదైనా కంపెనీ తొలిసారిగా షేర్ల విక్రయం ద్వారా పబ్లిక్‌లోకి రావడాన్ని ఐపీఓలుగా చెబుతారు. ఇక్కడ నిర్దిష్ట తేదీల్లో సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. సాధారణంగా ఐపీఓలకు మంచి గిరాకీ ఉంటుంది. అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఎన్నో రెట్ల మేర బిడ్స్ దాఖలు అవుతుంటాయి. గతేడాది పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఐపీఓలు బానే వచ్చినా.. ఈ ఏడాది కూడా పెద్ద సంస్థల నుంచి ఐపీఓలు ఉన్నాయి. వీటిల్లో NSE, రిలయన్స్ జియో, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, జెప్టో, ఓయో, ఫ్లిప్‌కార్ట్ ఇలా చాలా కంపెనీలు లైన్‌లో ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు.. ఐపీఓల విషయంలో కాస్త వెనుకంజ వేసేలా చేశాయి.

అయితే ఈ క్రమంలోనే కొన్ని చిన్న కంపెనీల నుంచి ఐపీఓలు వస్తున్నాయి. ఈ సమయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన ప్రముఖ సుగంధ ద్రవ్యాల తయారీ సంస్థ (మసాలా దినుసులు) పుష్ప్ బ్రాండ్ కూడా ఐపీఓకు వస్తోంది. ఇప్పుడు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) దగ్గర ఐపీఓ కోసం ప్రాథమిక ముసాయిదా పత్రాల్ని దాఖలు చేసింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఐపీఓ ద్వారా పుష్ప్ బ్రాండ్ సంస్థ.. సుమారు రూ. 800 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ప్రతిపాదిత ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలోనే ఉండనుంది. ప్రమోటర్లు, షేర్ హోల్డర్లు.. తమ వద్ద ఉన్న సుమారు 74.45 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారన్నమాట. కొత్తగా షేర్లను జారీ చేయడం లేదు.

కంపెనీ ముసాయిదా పత్రాల ప్రకారం.. ప్రమోటర్లు మహేంద్ర కుమార్ సురానా, సురేంద్ర కుమార్ సురానా తమ వాటాల్ని విక్రయించనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇన్వెస్టర్లు.. A91 ఎమర్జింగ్ ఫండ్ I LLP, సిక్స్త్ సెన్స్ ఇండియా అపార్చునిటీస్ III కూడా తమ షేర్లను ఐపీఓ కోసం విక్రయిస్తున్నారు.

పుష్ప్ బ్రాండ్ (ఇండియా) లిమిటెడ్ కంపెనీ విషయానికి వస్తే ఇది బ్రాండెడ్ ప్యాకేజ్డ్ మసాలా, ఆహార ఉత్పత్తుల సంస్థ. దీని పోర్ట్‌ఫోలియోలో స్వచ్ఛమైన మసాలాలు, మిశ్రమ మసాలాలు, ఇంగువ, వెస్ట్రన్ సీజనింగ్స్, క్విక్ ఫ్రై మిక్స్, సోయా ప్రొడక్ట్స్, టీ వంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఓర్‌క్లా ఇండియా, బాద్‌షా మసాలా వంటి కంపెనీలతో పోటీపడుతోంది. ఈ ఐపీఓ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్, సిస్టమేటిక్స్ కార్పొరేట్ సర్వీసెస్ వంటివి ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam