ఓ మహిళా నేతను ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ కఠిన చర్యలు తీసుకున్నారు.
2018 బ్యాచ్‌కు చెందిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న సిబ్బంది సోషల్ మీడియా వేదికలను ఉపయోగించే సమయంలో క్రమశిక్షణ, సంయమనం పాటించాల్సిందేనని సీపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం సైబరాబాద్ సీఏఆర్ నుంచి ఆర్డర్ టు సర్వ్‌లో భాగంగా హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న కె. అనిల్.. సోషల్ మీడియాలో ఓ మహిళా నేతను ఉద్దేశించి అభ్యంతరకర పదజాలంతో కామెంట్ పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పోలీస్ శాఖను ట్యాగ్ చేస్తూ సంబంధిత కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగిగా, ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తిగా అనిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. రాజకీయ అంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. వాటిని వ్యక్తం చేసే సమయంలో అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం బాధ్యతాయుతమైన ప్రవర్తన కాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో శాఖాపరంగా చర్యలకు సిద్ధమయ్యారు. ఈ ఘటనను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ తీవ్రంగా పరిగణించారు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, గౌరవప్రదమైన వ్యవహారశైలిని తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. విధుల్లో ఉన్నప్పుడే కాకుండా.. సోషల్ మీడియా వంటి బహిరంగ వేదికలను ఉపయోగించే సమయంలోనూ పోలీస్ సిబ్బంది తమ బాధ్యతలను గుర్తుంచుకోవాలని సూచించారు.
పోలీస్ సిబ్బంది వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో చేసే పోస్టులు, వ్యాఖ్యలు కూడా శాఖ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశం ఉందని సీపీ పేర్కొన్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై స్పందించే సమయంలో మరింత సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం అనిల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో పోలీస్ సిబ్బంది సోషల్ మీడియా వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. వ్యక్తిగత ఖాతాల్లోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించాలని, పోలీస్ శాఖకు సంబంధించిన వృత్తిపరమైన ప్రమాణాలను ఎల్లప్పుడూ పాటించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

