5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఘోర పరాజయం పాలవడంపైనా ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓటర్ల జాబితా నుంచి భారీ ఎత్తున పేర్లను తొలగించే ఎస్ఐఆర్ ప్రక్రియ.. ఆయా పార్టీల విజయ అవకాశాలను ఎలా దెబ్బతీసింది అనేది ఆయన వివరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించిన భవానీపూర్‌తోపాటు.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రాతినిధ్యం వహించిన కొళత్తూరు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు అయ్యాయని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కారణంగా మొత్తం 90 లక్షలకుపైగా ఓట్లను తొలగించగా.. అందులో సుమారు 31 లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఇది ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆరోపించారు. దీదీ స్వయంగా తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఓటమి పాలు కావడానికి కూడా ఈ ఎస్ఐఆర్ ఒక కారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు.. తమిళనాడులో కూడా ఇదే తరహాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీగా ఓట్లను తొలగించినట్లు తెలిపిన ఓవైసీ.. ఎంకే స్టాలిన్ వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కొళత్తూరులో కూడా ఓటర్ల గల్లంతు అధికార డీఎంకే పార్టీకి గట్టి షాక్ ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేవలం కొన్ని వర్గాలను టార్గెట్ చేసి ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడం అనేది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలిపెట్టు లాంటిదని ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగా.. ఈ ఎన్నికల్లో నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల రిజల్ట్స్ తారుమారు అయ్యాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఓట్ల గల్లంతుపై ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ప్రస్తుతం ఘోర పరాజయాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. బీజేపీ అఖండ విజయాల వెనుక ఇలాంటి టెక్నికల్ వ్యూహాలు కూడా ఉన్నాయని ఒవైసీ ఆరోపించారు.
ఎస్ఐఆర్‌తో ప్రజల పౌరసత్వాన్ని ముడిపెట్టడం తప్పని తాను పార్లమెంటులో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఓవైసీ గుర్తు చేశారు. పౌరసత్వం విషయంలో హోం మంత్రిత్వ శాఖకు కొన్ని రూల్స్ ఉన్నాయని.. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ నియమాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇది కేవలం ఓటు వేయడం గురించి మాత్రమే కాదని.. పౌరసత్వాన్ని కాపాడుకోవడం గురించి కూడా అని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని ఓవైసీ సూచించారు.
ఒక వ్యక్తికి ఒకటికంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉంటే వాటిని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగిస్తారు. అంతేకాకుండా చనిపోయిన వారి వివరాలను సేకరించి వారి పేర్లను లిస్ట్ నుంచి తీసేస్తారు. వలస వెళ్లిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారిని గుర్తించి ఓట్లను తొలగిస్తారు. అదే సమయంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క అర్హులను ఓటర్ల జాబితాలో చేర్చుతారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో చేపట్టిన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు.
బీజేపీకి వ్యతిరేకంగా, తమకు మద్దతు ఇచ్చే వర్గాలైన మైనారిటీలు, వలస కార్మికుల ఓట్లను కావాలనే ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో తొలగిస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షల మందికిపైగా ఓట్లను తొలగించారని.. ఇదే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలను తారుమారు చేసిందని మమతా బెనర్జీ ఇప్పటికే ఆరోపిస్తున్నారు.
ఇక ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి ఘోర పరాజయం దక్కింది. ఎంఐఎం పార్టీ 12 మంది అభ్యర్థులను బరిలో దించగా.. ఒక్కచోట కూడా కనీసం డిపాజిట్లు రాకపోవడం గమనార్హం. మాల్దా, బీర్బుమ్, ముర్షీదాబాద్, పశ్చిమ్ బర్ధమాన్, ఉత్తర దినాజ్‌పూర్, ఉత్తర 24 పరగణాలు వంటి 7 జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది.

