Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మమతా బెనర్జీకి భారీ షాక్.. రెబల్ ఎమ్మెల్యేను ప్రతిపక్ష నేతగా గుర్తించిన స్పీకర్

మమతా బెనర్జీకి భారీ షాక్.. రెబల్ ఎమ్మెల్యేను ప్రతిపక్ష నేతగా గుర్తించిన స్పీకర్

Telugu Samayam 1 week ago

శ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో భారీ షాక్ తగిలింది. టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు వెలువరించారు.

ప్రతిపక్షానికి కేటాయించిన ఛాంబర్ తాళాలను కూడా రితబ్రతకు సిబ్బంది అప్పగించారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక వెనక్కి తిరిగి రాని దశకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. తన సన్నిహితుడు శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్‌ను అసెంబ్లీలో టీఎంసీ నేతగా మమతా బెనర్జీ ఎంపిక చేయడంతో తిరుగుబాటు మొదలైన సంగతి తెలిసిందే.

మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో 59 మంది ఆయన ఎంపికను వ్యతిరేకించారు. అనంతరం రితబ్రత సారథ్యంలో రెబల్ వర్గం స్పీకర్‌ను కలిసి తమదే అసలైన టీఎంసీ అని, రితబ్రతను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా రితబ్రతను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, మమతా బెనర్జీయే తమ నేతని, పార్టీ చీల్చే ఉద్దేశం తనకు లేదని రితబ్రత బెనర్జీ స్పష్టం చేశారు. ''ఈ కూటమికి ముఖ్య సలహాదారుగా ఉండాలని మేము మమతా బెనర్జీని అభ్యర్థిస్తాం'' అని ఆయన అన్నారు.

శోభన్‌దేబ్‌ ఛటోపాధ్యాయ్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు మమతా మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కానీ, ఈ లేఖను స్పీకర్ తిరస్కరించగా.. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ, సాందీపన్ ఆరోపించారు. ఎన్నికలలో ఓటమి పాలైన నెల రోజుల్లోపే ఆ పార్టీ పేకమేడలా కుప్పకూలుతోంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు ఫిర్హాద్ హకీమ్ కోల్‌కతా మేయర్ పదవికి రాజీనామా చేశారు.

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. అనర్హత నుంచి తప్పించుకోవాలంటే చీలిక వర్గానికి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంటే టీఎంసీ రెబల్ వర్గంలో 53 మంది ఉండాలి. ప్రస్తుతం రెబల్‌ వర్గానికి 59 మంది మద్దతు ఉండటంతో టీఎంసీ పేరు, గుర్తును వారు సొంతం చేసుకునే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam