Dailyhunt
'మరో ఆలోచన లేదు, సస్పెండ్ చేస్తా.. మీరే తేల్చుకోండి'.. చంద్రబాబు సీరియస్

'మరో ఆలోచన లేదు, సస్పెండ్ చేస్తా.. మీరే తేల్చుకోండి'.. చంద్రబాబు సీరియస్

Telugu Samayam 0 months ago

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పార్టీ నేతలకు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో లీగల్‌ అడ్వైజర్‌ విషయంలో అరవిందబాబు హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎమ్మెల్యే అరవిందబాబు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి వివరణ ఇచ్చారు. ఈ నివేదికను చంద్రబాబుకు అందజేశారు. ఈ క్రమంలో చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

పార్టీలో కొందరు నేతలు ప్రవర్తించిన తీరు సరిగాలేదని.. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు చంద్రబాబు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే.. మరో ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తానని సీరియస్ అయ్యారు. రాజకీయాల్లో క్రమశిక్షణతో సుదీర్ఘ కాలం ఉండాలనుకుంటున్నారో.. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటున్నారో.. తేల్చుకోవాలని హెచ్చరించారు.

అంతకముందు చదలవాడ అరవిందబాబు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఎస్పీ ఆఫీస్ ఘటనపై లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. పార్టీ ఆదేశాలు ఉల్లంఘించే ఉద్దేశం లేదని.. అనుకోకుండా ఇదంతా జరిగిందన్నారు నరసరావుపేట ఎమ్మెల్యే. భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానన్నారు. గతంలో కూడా ఇలాగే ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేసిన విషయాన్ని పల్లా శ్రీనివాసరావు అరవిందబాబు దగ్గర ప్రస్తావించారు. మరోసారి ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదని స్వయంగా చంద్రబాబు మాటగా చెబుతున్నానన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఊరుకునేది లేదన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇన్‌ఛార్జి మంత్రితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఇటీవల నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు జిల్లా ఎస్పీ ఆఫీసులో హంగామా చేశారు. దాదాపు 10 గంటల పాటూ అక్కడే బైఠాయించారు. పల్నాడు జిల్లా పోలీసు సెల్‌ న్యాయ సలహాదారు పదవి విషయంలో పట్టుబట్టారు. తాను సూచించిన వ్యక్తి పేరును ఎందుకు ఆమోదించలేదంటూ ప్రశ్నించారు. ఆర్డర్ కాపీ కావాల్సిందేనని పట్టుబట్టి అక్కడే బైఠాయించారు. తాను 8 నెలల క్రితం న్యాయసలహాదారు పదవి కోసం సిఫార్సు చేస్తూ ఎస్పీ కార్యాలయానికి లేఖ పంపానన్నారు. ఇప్పటి వరకు ఎందుకు సంతకం చేయలేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని పరిశీలించి సంతకం చేస్తానని ఎస్పీ చెప్పినా సరే ఎమ్మెల్యే వినలేదు. ఎస్పీ అక్కడి నుంచి వెళ్లొచ్చి ఆ లేఖపై సంతకం చేసి డీజీ ఆఫీసుకు పంపారు. అయినా అరవిందబాబు అక్కడే ఉన్నారు.. నియామకంపై ఉత్తర్వులు ఇవ్వాల్సిందేనన్నారు. 10 గంటల హైడ్రామా తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది.. వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam