సినిమా హీరోలు డ్రగ్స్ టెస్ట్‌లు చేయించుకోవాలని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్ యాక్టివిటీ ఎక్కువగా జరిగేది సినీ పరిశ్రమలోనే అని, స్టార్ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేసుకుని మాదక ద్రవ్యాలు తీసుకోవడం తప్పని చెప్తే, వారి అభిమానులు కూడా ఆ దారిలోనే నడుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తో సహా అందరు హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయాలనే కండిషన్ పెట్టాలన్నారు. ప్రతీ 90 రోజులకు ఒకసారి సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలని, లేదంటే వాళ్లు డ్రగ్స్ తీసుకున్నట్లేనని అనిరుధ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై నటుడు రాహుల్ రామకృష్ణ తాజాగా స్పందించారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా రాహుల్ రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోడానికి రెడీ అని, అయితే అబద్ధం చెబుతున్నారా లేదా నిజం చెబుతున్నారా అని తెలుసుకోవడానికి రాజకీయ నాయకులు 'లై డిటెక్టర్ టెస్ట్' (పాలిగ్రాఫ్) చేయించుకోవాలని సెటైర్లు వేశారు. హీరోలకే పరిమితం కాకుండా, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, మిగతా టెక్నీషియన్స్ అందరికీ టెస్టులు చేయిద్దామని రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
''హీరో కాకపోయినా నేను మాత్రం డ్రగ్ టెస్టుకు రెడీ. అర్జెంటుగా జీవో జారీ చేస్తే అందరం కలిసి చెయ్యిచ్చుకుందాం. మేము డ్రగ్ టెస్టులు.. మీరు లై డిటెక్టర్ టెస్ట్. ఈ గొప్ప కార్యక్రమం ప్రతీ ఆదివారం పెట్టుకుందాం. అప్పుడే మీ మాట, మా మాట నమ్మి ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు. మినోక్సిడిల్ డ్రగ్ ఎందుకు గుర్తొస్తోందో'' అని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు. మరో పోస్ట్ పెడుతూ.. ''ఒట్టి హీరోలకే పరిమితం కాకుండా, ఎటువంటి వివక్షత లేకుండా హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మిగతా టెక్నీషియన్స్ కి కూడా ఈ సౌలత్ కలుపుదాం. ఇతర భాషల హీరోల సినిమాలు ఇక్కడ రిలీజ్ అయితే, వాళ్ళని కూడా మన సండే-ఫండే స్పెషల్ లో కలిపేసుకుందాం. మళ్ళెందుకో నాకు మినోక్సిడిల్ గుర్తిస్తోంది'' అని రాహుల్ రాసుకొచ్చారు.
మంచు విష్ణు వ్యాఖ్యలపై అనిరుధ్ రెడ్డి రియాక్షన్..
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కామెంట్స్ కి ఇప్పటికే 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి ముందు ఎంతమంది రాజకీయ నాయకులు టెస్టులు చేయించుకుంటున్నారని విష్ణు ప్రశ్నించారు. గౌరవనీయ ఎమ్మెల్యేలు కూడా పారదర్శకంగా ఉంటే ఓటర్లు సంతోషిస్తారని తాను భావిస్తున్నానని ట్వీట్ చేశారు. విష్ణు కామెంట్స్ పై తాజాగా అనిరుధ్ రెడ్డి స్పందించారు. మంచు మోహన్ బాబు ఏం టెస్టులు చేయించుకొని రాజ్యసభ ఎంపీ అయ్యారని ఎదురు ప్రశ్నించారు. ఒక రాజకీయ నాయకుడిగా టెస్టులు చేయించుకొని పబ్లిక్ డొమెయిన్ లో రిపోర్టులు పెట్టానని, సినిమా హీరోలు కూడా టెస్టులు చేయించుకొని రిపోర్టులు పెట్టాలని కోరారు. రాజకీయ నాయకులకు ఏం టెస్టులు చేయాలో చెబితే, అవన్నీ చేయిచుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని అనిరుధ్ రెడ్డి అన్నారు.
