మైనర్ బాలికకు మాయమాటలు చెప్పిన ఓ వ్యక్తి.. ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో బాలిక పోక్సో కేసు పెట్టింది. ఆ తర్వాత ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనివ్వగా..
దానికి కారణమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్తకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు అతడు తన భర్త కాబట్టి.. శిక్ష వేయొద్దంటూ కోర్టును వేడుకుంటోంది. దీంతో ఈ కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైనర్‌ను గర్భవతిని చేసి.. ఆమెను పెళ్లి చేసుకుంటే.. తప్పు ఒప్పు అవుతుందా అనే చర్చ మొదలైంది. హనుమకొండ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
హనుమకొండలోని దీన్‌దయాల్ నగర్‌కు చెందిన వల్లెపు రాజు అనే వ్యక్తి.. 4 ఏళ్ల క్రితం ఓ 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానంటూ నమ్మించి.. ఆమెను గర్భవతిని చేశాడు. బాలిక స్వస్థలం సూర్యాపేట జిల్లా కాగా.. తల్లిదండ్రులు చనిపోవడంతో.. హనుమకొండలోని చిన్నమ్మ ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమెను వలలో వేసుకున్న రాజు.. ప్రేమ పేరుతో మోసం చేశాడు. అయితే బాలిక అనారోగ్యంతో బాధపడుతుండటం చూసిన చిన్నమ్మ.. ఏం జరిగిందని ప్రశ్నించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలికతో కలిసి 2022 ఆగస్ట్ 8వ తేదీన రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై పోక్సో కేసు పెట్టిన పోలీసులు.. అరెస్ట్ చేశారు.
ఈ పోక్సో కేసు నమోదైన 2 నెలలకే ఆ బాలిక.. ఒక బాలుడికి జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే నిందితుడు రాజు.. ఆ బాలికను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. అయితే ఆ పెళ్లి చేసుకోవడానికి ముందు రాజు మీద పెట్టిన పోక్సో కేసులో కోర్టు విచారణ చేస్తూనే ఉంది. ఇక రాజు, బాలిక మధ్య చిన్న చిన్న గొడవలు జరగడంతో ఆమె తన చిన్నమ్మ ఇంటికి కొన్ని రోజులు వెళ్లిపోయింది. విచారణ సందర్భంగా.. రాజుకు వ్యతిరేకంగా బాలిక, ఆమె చిన్నమ్మ కోర్టులో సాక్ష్యం చెప్పారు.
ఈ క్రమంలోనే ఇటీవల హనుమకొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజును దోషిగా తేల్చిన జడ్జి బి.అపరాధేవి.. అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అదే సమయంలో బాధితురాలికి రూ.1.70 లక్షల పరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో రాజును పోలీసులు జైలుకు తరలించారు.
అయితే ఇప్పుడు బాధితురాలు మనసు మార్చుకుని.. పెళ్లికి ముందు తన భర్త చేసిన తప్పుకు ఇప్పుడు శిక్షించవద్దని కోరుతోంది. ఈ కేసులో తన భర్తను వదిలిపెట్టాలని బాధితురాలితోపాటు ఆమె చిన్నమ్మ కూడా వేడుకుంటోంది. ప్రస్తుతం తాము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని.. 4 ఏళ్ల బాబు కూడా ఉన్నాడని.. ఇప్పుడు తన భర్తను జైలుకు తరలిస్తే.. తమ కుటుంబం పరిస్థితి ఏంటని బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

