రోజురోజుకూ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎన్ని ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చినా.. ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది.
మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా కూడా ఎప్పటికప్పుడు పెంచుతున్నా.. ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ఇతర రాష్ట్రాలు, తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వారు చాలా మంది ఉంటారు. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లపై బస్సుల రాకపోకల ఒత్తిడి తీవ్ర నెలకొంది.
ఈ పరిస్థితిని తప్పించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జీడిమెట్ల గాజుల రామారంలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రత్యేక బస్ టెర్మినల్‌తోపాటు సిటీ బస్సులకు మరో టెర్మినల్.. ఎలక్ర్టిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం హైదరాబాద్‌కు వచ్చే బస్సులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ సరికొత్త బస్ టెర్మినల్ నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే గాజులరామారంలో 100 ఎకరాల భూమిని టీజీఎస్‌ఆర్టీసీ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఇటీవలె కేటాయించారు. ఈ వంద ఎకరాల్లో సుమారు 30 ఎకరాలను అంతరాష్ట్ర బస్సుల కోసం ఒక ప్రత్యేక టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. సిటీ బస్సులను కూడా ఈ బస్ టెర్మినల్ నుంచే అన్ని ప్రాంతాలకు నడిపించేందుకు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సిటీ బస్ టెర్మినల్‌ను నిర్మించనున్నారు. ఈ బస్ టెర్మినల్‌లో అత్యాధునిక సౌకర్యాలు, దుకాణాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎలక్ర్టిక్ బస్సుల కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో డిపో.. ఈవీ బస్సుల కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
రానున్న రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులను నగరంలోకి రాకుండా ఈ బస్ టెర్మినల్‌లోనే ఆపేయనున్నారు. ఇప్పటికీ చాలా బస్సులు కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, గండిమైసమ్మ, గాజులరామారం, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, లింగంపల్లి ప్రాంతాల్లో నిలిపేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు.. మెదక్ నుంచి వచ్చే బస్సులు రోడ్లపైనే ఆగుతుండటంతో.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక జగద్గిరిగుట్టలో నిత్యం దాదాపు 60 బస్సులు నైట్‌హాల్ట్‌లో ఉంటున్నాయి. వాటిని ఉంచడానికి చోటు లేకపోవడం, ఆర్టీసీ సిబ్బంది పడుకునేందుకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి.
మరోవైపు.. ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద టీజీఎస్ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్‌లో హైదరాబాద్‌లో ఆర్టీసీ సర్వీసులన్నీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారనున్నాయి. 6 నెలల నుంచి ఏడాదిన్నర కాలంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు రానుండటంతో.. ప్రస్తుతం ఉన్న డిపోలు కాకుండా కొత్తగా మరో 10 బస్ డిపోలను నిర్మించాలని ఆర్టీసీ భావిస్తోంది. దీంతో 10 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్ డిపోను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ బస్ టెర్మినల్‌కు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నందున ఒక మల్టీలెవల్ పార్కింగ్ యార్డును కూడా అండర్ గ్రౌండ్‌లో నిర్మించే యోచన చేస్తున్నారు.

